చౌటుప్పల్ రూరల్, జూలై 24: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన చేనేత కార్మికుడు కర్నాటి ముఖేశ్ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రత్యేక డిజైన్‌తో ప్రకృతి రంగులతో పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీర తయారు చేసినందుకు జాతీయ స్థాయి సెయింట్ కబీర్ హ్యాండ్లూమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. డబుల్ ఇక్కత్ విభాగంలో కేంద్ర చేనేత జౌళిశాఖ జాతీయ స్థాయిలో అందించే 2023 పురస్కారానికి దేశ వ్యాప్తంగా 14 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ముఖేశ్‌కు గుర్తింపు దక్కింది.
అవార్డు కోసం రాష్ట్రం నుంచి 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. కర్ణాటి ముఖేశ్ ప్రకృతి రంగులను ఉపయోగించి వంద రకాల పూల డిజైన్లతో తయారు చేసిన డబుల్ ఇక్కత్ చీర ప్రత్యేకత కనబర్చడంతో నిపుణుల కమిటీ పురస్కారానికి ఎంపిక చేసింది. కర్నాటి ముఖేశ్ బీటెక్ చదివారు. తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన చేనేత వృత్తిపై మక్కువతో 15 ఏండ్లుగా అందులోనే కొనసాగుతూ.. ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండాలక్ష్మణ్ చేనేత అవార్డు అందుకున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన ముఖేశ్‌ను చేనేత సంఘం నాయకులు, స్థానికులు అభినందించారు.