సిరిసిల్లా : జనశక్తి మిలిటెంట్‌గా పనిచేస్తున్న సమయంలో దాచిపెట్టుకున్న తపంచాతో కొడుకును బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని సదరు మాజీ మిలిటెంట్‌ను పోలీసులు కటకటలాపాలు చేశారు. సిరిసిల్లా జిల్లా బావుసాయిపేట గ్రామానికి చెందిన నేవూరి హన్మయ్య(75) అనే వ్యక్తి జనశక్తి దళంలో పనిచేస్తుండగా పార్టీ ఆయనకు ప్రాణ రక్షణ కోసం తపంచా, కొన్ని బుల్లెట్లను అందజేసింది. హన్మయ్య వాటిని తన వ్యవసాయ పొలంలో దాచిపెట్టుకున్నాడు.
వారం రోజుల క్రితం భార్య అనారోగ్యంతో చనిపోగా కర్మలు చేసే విషయంలో కొడుకుతో గొడవ జరిగింది. కొడుకు తన మాట వినడం లేదన్న కోపంతో పొలం వద్ద ఉంచిన తపంచాను తీసుకువచ్చేందుకు వెళ్లాడు. తపంచాతో బెదిరించి తన మాట వినేలా చేసుకుందామని వాటిని తీసుకుని వస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. గ్రామానికి చేరుకున్న పోలీసులను చూసి పారిపోతున్న హన్మయ్యను పట్టుకుని విచారించారు. అతని వద్ద తపంచాతో పాటు రెండు 8 ఎంఎం బుల్లెట్లను కోనరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. గతం లో జనశక్తి, ఇతర నిషేదిత పార్టీ లలో పని చేసినపుడు దాచుకున్న ఆయుధాలు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సూచించారు. పోలీసుల తనిఖీల్లో దొరికితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.