Dharani | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘తన మొహం కడుక్కోవడం చాతగానోడు.. మందిని చూసి ఎక్కిరించిండట. మా పార్టీ ముఖ్యనేతల పరిస్థితి అట్లాగే ఉన్నది’ అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేని తరుణంలో, అనవసరమైన విషయాలు లేవనెత్తి తమ పార్టీ నాయకత్వం వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నదని వారు ఆక్రోశిస్తున్నారు. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పదేపదే ప్రకటించడం క్షేత్ర స్థాయిలో బూమరాంగ్ అవుతున్నదని అభిప్రాయపడుతున్నారు. ‘రాజకీయంగా ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో తన తప్పులను చాప కింద దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంది. వీలైతే ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మాంసం తిన్నామని బొక్కలు మెళ్లో వేసుకుని ఎవరూ తిరగరు. కానీ ధరణి విషయంలో మా రేవంత్, భట్టి ఇదే పని చేస్తున్నరు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.
‘ఉమ్మడి రాష్ర్టాన్ని అత్యధిక కాలం పరిపాలించింది మా పార్టీయే. మా పార్టీ నేతలు అంగీకరించినా, అంగీకరించకున్నా కాంగ్రెస్ పాలన అంటే పైరవీకారుల రాజ్యంగా పేరుమోసింది. తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ పథకాల్లో నగదు బదిలీ వల్ల, డిజిటల్ పద్ధతిని వాడడం వల్ల పైరవీకారుల ప్రభావం చాలా వరకు తగ్గింది. పేదలకు లంచాల బాధ, తిరుగుడు బాధ తప్పింది. ఇది నిజం. ఈ సమయంలో ధరణిని తీసేసి పాత పద్ధతి తెస్తామంటూ, మావాళ్లే మా పాపాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఇదెక్కడి తెలివో మాకు అర్థం కావడం లేదు’ అని ఆయన
పేర్కొన్నారు.
కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటున్నదని వాదించే అవకాశం ఆ పార్టీకి దక్కిందని, అయితే కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక తప్పిదాలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని రాజకీయ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. ‘కేసీఆర్ అసలే రాజకీయ గండరగండడు. ఉద్యమ సమయంలో ఎమ్మెస్సార్ ఏదో మాట వరుసకు రాజీనామా సవాల్ విసిరితే.. దాన్ని అందిపుచ్చుకుని, రాజీనామా చేసి, ఉప ఎన్నిక తెచ్చి, భారీ విజయం సాధించి ఉద్యమ గతినే మార్చి పారేశాడు. అలాంటి కేసీఆర్‌కు ధరణి రద్దు పేరుతో కాంగ్రెస్ నేతలు జుట్టు చేతికి అందించారు. ఇక ఆయన ఊరుకుంటాడా? కాంగ్రెస్ పాత పాపాలను జనం ముందు పెట్టడానికి ధరణి ఆయనకు పెద్ద అవకాశంగా మారింది’ అని ఆయన అన్నారు.
అటు రేవంత్, ఇటు భట్టి లాజిక్ లేకుండా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారని.. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలపై వారికి కనీస అవగాహన లేదని ఉత్తర తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ తప్పుబట్టారు. ‘అసలే కాంగ్రెస్‌కు అవినీతి పార్టీ అనే ముద్ర ఉంది. ధరణిని ఎత్తివేస్తామంటూ ఆ ముద్రను మరింత గట్టిగా ప్రచారం చేసుకుంటున్నం. రాజీవ్‌గాంధీ టెక్నాలజీతో దేశాన్ని 21వ శతాబ్దిలోకి నడిపించాడని మేం చెప్పుకొంటాం. ఇప్పుడు ప్రపంచమంతా డిజిటలైజేషన్‌తో ముందుకు పోతున్నది. మా వాళ్లేమో వెనక్కి పోతామంటున్నారు. ఇదీ వాళ్ల ప్రాపంచిక అవగాహన. కర్ణాటక ఊపు వల్ల నిన్నమొన్నటి దాకా తెలంగాణలో గట్టిగా కొట్లాడవచ్చు. సీట్లు కూడా గెలుస్తాం అనుకున్నాం. అయితే ఇప్పుడు మా నాయకద్వయం తీరు చూస్తుంటే డిపాజిైట్లెనా దక్కుతాయా లేదా అన్న అనుమానం కలుగుతున్నది’ అని ఆయన అన్నారు.
ప్రజాక్షేత్రంలో దోషులుగా ఆ ఇద్దరు
‘కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లలో ఎన్ని అక్రమాలు జరిగాయో ప్రజలకు ఇంకా గుర్తున్నది. ధరణి పోర్టల్‌తో ఇప్పుడు వారిలో కొంత భరోసా కలిగింది. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ప్రయోజనాలను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఇద్దరూ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడ్డారు. కేసీఆర్‌లాంటి నాయకుడిని ఎదుర్కొనాలంటే, ఏ అంశంతో ప్రజల్లోకి వెళ్లాలో కూడా తెల్వని అయోమయ స్థితిలో మా నాయకత్వం ఉంది. మా ఖర్మ’ అని కురు వృద్ధుడైన పీసీసీ మాజీ అధ్యక్షుడొకరు అసహనం వ్యక్తంచేశారు. ‘ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై పార్టీలో ఒక చర్చ లేదు. అంతర్గత సమాలోచన అంతకంటే లేదు. అంతా ఒంటెత్తు పోకడ. పోనీ వాళ్లకు కేసీఆర్‌ను ఎదుర్కొనే తెలివితేటలు ఉన్నాయా అంటే అదీ లేదు.
భూముల దందాలే నేపథ్యంగా ఎదిగిన ఒక నాయకుడు, ధరణి పోర్టల్‌ను ఎత్తివేసి, పాత పద్ధతి తెస్తానంటూ జనంలోకి పోతే, ఏం సందేశం ఇచ్చినట్టు? కనీసం ఈ మాత్రం తెలివిడి అయినా ఉండాలి కదా’ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ధరణిపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని గమనించే బీజేపీ దాని జోలికి పోవడం లేదనీ, తమ నేతలమో కనీస జ్ఞానం లేకుండా పిచ్చిపిచ్చి ప్రకటనలు చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ ఒకరు అన్నారు. ధరణి పోర్టల్ వల్ల లబ్ధిపొందిన కుటుంబాలు ప్రతి గ్రామంలోనూ వందల సంఖ్యలో ఉంటాయని చెప్తున్నారు. కేవలం ఒక్కశాతం మంది ఇబ్బందులను బూచిగా చూపి 99 శాతం మందికి అన్యాయం చేస్తామని చెప్తున్నారు. ‘ఒకరికి ఇబ్బందిగా ఉందని 99 మందికి లాభం చేసేదాన్ని తీసేస్తమా? ఎన్నికల్లో ఒకరు ముఖ్యమా? 99 మంది ముఖ్యమా? మా వాళ్లకు ఈ మాత్రం లెక్క తెల్వకపోతే ఇక ఎన్నికల్ని ఎదుర్కొన్నట్టే’ అని ఆయన పెదవి విరిచారు. 69 ఏండ్ల కేసీఆర్ ధరణి, నగదు బదిలీ అని ఆధునికంగా ఆలోచిస్తుంటే.. యువ నాయకులుగా చెప్పుకొనే మా వాళ్లు కాలంలో వెనక్కిపోతున్నారని యూత్ కాంగ్రెస్ ముఖ్యుడొకరు తప్పుబట్టారు.
డిఫెన్స్‌లో కాంగ్రెస్!
ప్రజల్లో ఉన్న సానుకూలతను గమనించే కేసీఆర్ ప్రతి సభలో ధరణిని ప్రస్తావిస్తూ, దాన్ని ఎన్నికల ప్రధానాంశంగా మారుస్తున్నారని, ఇక ధరణిని ముందుపెట్టి, ఆయన కాంగ్రెస్ పాత తప్పుల్ని బట్టలిప్పించి మరీ చూపిస్తారని, తద్వారా కాంగ్రెస్, మరీ ముఖ్యంగా రేవంత్ డిఫెన్స్‌లో పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకుడొకరు వివరించారు. ఈసారి ఎన్నికను ‘కాంగ్రెస్ ప్రభుత్వాల భూ దందాల’ మీదే జరిగేలా కేసీఆర్ మలిచినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. “సాధారణంగా పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీని విపక్షాలు డిఫెన్స్‌లో పెడతాయి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతున్నది.
ఇక్కడ అధికారపక్షమే విపక్షాన్ని డిఫెన్స్‌లో పారేస్తున్నది. ఇందులో కేసీఆర్ చాణక్యం కొంత ఉన్నా, కాంగ్రెస్ నేతల స్వయంకృత అపరాధమే ఎక్కువ” అని సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ బీట్ చూస్తున్న పాత్రికేయుడొకరు వ్యాఖ్యానించారు. ధరణిని ముట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతలు అనవసరంగా తేనెతుట్టెను కదిపారని అన్నారు. “వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఏక నాయకత్వం లేదు. ‘ఆలు లేదు.. చూలు లేదు… కొడుకుపేరు సోమలింగం’ అన్నట్టు, నేను సీఎం అంటే నేనే సీఎం అని బహిరంగంగానే కొట్టుకుంటున్నారు. రేపటి రోజున తనకు పోటీ వస్తాడేమోనని ముందే కట్ చేసే పీత రాజకీయం సాగుతున్నది. ఎవరు వలసవాదులు, ఎవరు ఒరిజినల్… ఎవరు టీడీపీ ఏజెంట్, ఎవరు బీఆర్ఎస్ ఏజెంట్…
ఎవరు సీనియర్, ఎవరు లెజెండ్ అనే చర్చలు బహిరంగంగానే జరుగుతున్నాయి. చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు అధిష్ఠానం ఒకటి. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాల్సిందే. నిన్నటికి నిన్న కర్ణాటకలో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తే.. ముఖ్యమంత్రి ఎవరో తేల్చడానికి మూడు రోజులు పట్టింది. అదీ కర్ణాటకలో ఇద్దరు నేతలుంటేనే. సీఎం పదవిని వారికి చెరి సమానం పంచినట్టు సమాచారం. మరి తెలంగాణ కాంగ్రెస్‌లో ‘పది మంది ముఖ్యమంత్రులు’న్నారు. అందులో సోనియా గ్రూపు, రాహుల్ గ్రూపు, ప్రియాంక గ్రూపు, ఖర్గే గ్రూపు! గతంలో వైఎస్ హయాంను మినహాయిస్తే, మిగతా అన్నిసార్లూ.. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడే! ఇటు కేసీఆర్ 9 ఏండ్లుగా నిరాఘాటంగా ముఖ్యమంత్రిగా కొనసాగిన తెలుగు సీఎంగా చరిత్ర సృష్టించారు. డిసెంబరుతో దక్షిణాదిలోనే ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు సృష్టించబోతున్నారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ నేతలకు ఓటేస్తే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి చేస్తరనే భావన ఉన్నది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యులు వ్యూహాత్మకంగా చేస్తున్న బ్లండర్స్ ఆ పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి” అని పొలిటికల్ కాలమిస్ట్ ఒకరు విశ్లేషించారు.