హాలియా, సెప్టెంబర్ 17: సరైన భోజనం అందడంలేదని, చదువు సరిగా చెప్పడంలేదని, పట్టించుకునే వారులేరని, తమను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారంటూ నల్లగొండ జిల్లా హాలియాలోని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పురుగుల అన్నం మాకొద్దు.. ఈ ప్రిన్సిపాల్, చదువు చెప్పరాని టీచర్లు వద్దు’ అంటూ మంగళవారం మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి మంజూరైన బీసీ గురుకుల పాఠశాలను అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో హాలియాలోని నిర్మల ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటుచేశారు. మూడేండ్ల నుంచి ఇక్కడే నిర్వహిస్తున్నారు.
నిరుటి వరకు చదువు బాగానే ఉంది. భోజనం కూడా మెనూ ప్ర కారం అందేది. పదో తరగతిలో మంచి రిజల్ట్ కూడా వచ్చాయి. కాగా, గత నెలలో ప్రభు త్వం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. ఇక్కడి ప్రిన్సిపాల్ బదిలీపై వెళ్లగా, ఆమె స్థానంలో క్రాంతి వచ్చారు. అప్పటి నుంచి మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, భోజనం, టిఫిన్‌లో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు సక్రమంగా బోధించడం లేదని ఆందోళనకు దిగారు.
తాము చెప్పిన ఒ క్క సమస్య కూడా పరిష్కరించలేదని, అన్నింటికీ అడ్జెస్ట్ కావాలని టీచర్లు చెబుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మూకుమ్మడిగా టీసీలు తీసుకుని పాఠశాల విడిచి వెళ్లిపోతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, వంట మాస్టర్ మారడం వల్ల భోజనంలో పురుగులు వస్తున్నాయని, సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ క్రాంతి చెప్పుకొచ్చారు.
అన్నంలో పురుగులు వస్తున్నాయి
కొత్త ప్రిన్సిపాల్ వచ్చిన దగ్గరి నుంచి స్కూల్లో సమస్యలు మొదలయ్యాయి. స్టూడెంట్స్ చెప్పిన ఏ సమస్యనూ పట్టించుకోవడం లేదు. చదువు బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని చాలా మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు.
-దుర్గ, ఇంటర్మీడియట్ విద్యార్థిని
పాఠాలు అర్థమవడం లేదు
మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నా యి. సమస్యలను టీచర్ల దృష్టికి తీసుకెళ్తే సర్దుకుపోవాలంటున్నారు. సబ్జెక్టులు కూడా బాగా చెప్పడం లేదు. పాఠాలు అర్థమవడం లేదు. మమ్ముల్ని ఇక్కడ కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు.
-సుప్రజ, పదో తరగతి విద్యార్థిని
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో గురుకులాల్లో మె నూ ప్రకారం భోజనం, చ క్కటి విద్యాబోధన అం దేది. ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వానంగా మారింది. గురుకుల పాఠశాలలను బాగా నడిపిస్తే కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. పేద విద్యార్థుల చదువుపై కక్ష గట్టడం దుర్మార్గం. హాలియా బీసీ గురుకుల పాఠశాలలో సమస్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి.
-నోముల భగత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే