మహబూబూబ్గర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘హకీంపేట పారిశ్రామికవాడ ఏర్పాటులో అక్రమాలపై నిగ్గు తేల్చుతాం.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరుపుతాం.. పరిహారం అందనివారికి న్యాయం చేస్తాం..’ అంటూ హడావుడి చేసిన అధికారులు, నేతలు చివరికి ‘షాడో’కు మరోసారి దాసోహం అయ్యారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం నామమాత్రంగా ‘గ్రామసభ’ నిర్వహించినా, అంతా షాడో కనుసన్నల్లో జరిగింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం భారీ పోలీస్ బందోబస్తుతో సభను ‘షాడో’ తన అదుపులోకి తీసుకున్నాడు. సర్పంచ్ లేకుండా సభను నడిపించాడు. ఎవరినీ మాట్లాడనీయకుండా అరాచకపర్వానికి తెరలేపాడు. పరిహారం అడిగిన రైతులను, ప్రశ్నించినవారిని పోలీసులు బయటికి తీసుకెళ్లారు. గ్రామసభ చివర్లో.. ఏ హోదా లేని షాడో మరోసారి ‘నమస్తే తెలంగాణ’పై కారుకూతలు కూశాడు. మొత్తం ‘షాడో చెప్పిందే వేదం’ అన్నట్టుగా గ్రామసభ సాగిందని స్థానికులే ఆరోపిస్తున్నారు.
అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు అంటూ ఊదరగొట్టిన హకీంపేట గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసాభాస అయ్యింది. ఎప్పటిలాగానే సర్పంచ్ తెరమీదికి రాకుండా, మొహం చాటేశారు. ఈ సందర్భంగా ఓ రైతు తనకు రావాల్సిన నష్టపరిహారం పెండింగ్‌లో ఉన్నదని, ఎందుకు ఇవ్వడంలేదని గ్రామసభలో ప్రశ్నించాడు. దీంతో గొడవ ప్రారంభమైంది. తమకు పరిహారం ఇవ్వకుండా దబాయిస్తున్నారంటూ ఆ రైతు సోదరుడు సైతం ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో పోలీసులు వారిద్దరినీ బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. పరిహారం కోసం అడుగుతుంటే ఇలా చేస్తారా? అంటూ మిగతా రైతులు ఎదురుతిరిగారు. అక్కడే ఉన్న షాడో.. వారిద్దరినీ పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను చెదరగొట్టారు. మరోవైపు గ్రామ పంచాయతీ భవనం కట్టి ఆరు నెలలు అవుతున్నదని, ఇంతవరకు బిల్లు ఇవ్వలేదని కాంట్రాక్టర్ ప్రశ్నించడంతో కలకలం రేగింది. చివరికి ఉప సర్పంచ్‌తోపాటు సభ్యులంతా షాడో చెప్పినట్టు విని సంతకాలు పెట్టి వెళ్లిపోయారు.
గ్రామసభ కోసం వందమందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొడంగల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామాన్ని దిగ్బంధించారు. గ్రామంలోకి వచ్చే అన్ని ప్రవేశాల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏ ఒక్కరూ నోరు మెదపకుండా ముందుగానే నిఘా పెట్టారు. గ్రామ సభకు వస్తున్న రైతులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. గ్రామసభలో ఎవరు ప్రశ్నించినా, తమ ఆవేదనను చెప్పుకున్నా పోలీసులు వెంటనే వారిని ఈడ్చివేశారు.
గ్రామసభ మొత్తం షాడో చెప్పిన ప్రకారమే జరిగిందని పాలకవర్గ సభ్యులే విమర్శిస్తున్నారు. గతంలో గ్రామసభ నిర్వహించిన విషయాన్ని వార్డు సభ్యుడికే తెలియకుండా తీర్మానాలు చేసి, ఇప్పుడు బహిరంగంగా నిర్వహించడంపై వార్డు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. షాడో ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఉప సర్పంచ్ చదివి వినిపించినా, ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరికి నాలుగు తీర్మానాలు చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవాలను బయటికి తీసిన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికను గ్రామ శత్రువుగా ప్రకటించి తన అక్కసు వెళ్లగక్కారు. అక్రమాలపై తేల్చాలని చెప్పకుండానే సర్వే నంబర్లకు పూర్తిగా హద్దులు పాతాలని, కబ్జాలను తొలగించాలని తీర్మానించారు. కుంభకోణాలపై ఆధారాలు సహా ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో బయటపెట్టినా, ఏ ఒక్క దానికి కూడా గ్రామసభలో సమాధానం ఇవ్వలేదు.
అక్కడే ఉన్న షాడో సైతం.. తాను ఒక్క రూపాయి కూడా తినలేదని చెప్పే ధైర్యం చేయలేక, నీళ్లు నమిలారు. పేద రైతులకు చెందాల్సిన పరిహారం రూ.1.2 కోట్ల మేర స్వాహా చేసినట్టు వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేదు. గ్రామసభ అనంతరం సైతం ‘నమస్తే తెలంగాణ’పై విష ప్రచారానికి దిగారు. పోలీసులు రైతులను ఈడ్చుకెళ్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ‘తప్పుడు కథనాలు, వార్తలు రాసిన వారిని కొట్టొద్దంటూ గ్రామస్తులు వారిస్తున్నారు’ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి దిగడం గమనార్హం. గ్రామంలోని సర్వే నంబర్ 252ను ఇష్టానుసారంగా అమ్ముకొని, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల కొంప ముంచింది షాడో సోదరుడేనని రైతులు శాపనార్థాలు పెట్టారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో భారీ కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ భూమిని చెరబట్టి పెద్దఎత్తున పరిహారం దోచుకుతిన్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై నిగ్గు తేల్చకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులతో పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడారు. హకీంపేట గ్రామంలో కొందరు కాంగ్రెస్ నేతలు పేదలకు ఇచ్చే పరిహారాన్ని పక్కదోవ పట్టించి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతులకు అరకొర పరిహారం అందించి, భూములే లేని వారి పేర నకిలీ రికార్డులు సృష్టించి, కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో వచ్చే పరిశ్రమల నుంచి కూడా కమీషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. అన్నింటినీ దోచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు.