Gutha Sukhender Reddy | నల్లగొండ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు క్లియరెన్స్‌తో డిండి ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయినట్లేనని ఆయన స్పష్టం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులోని మొత్తం రెండు టీఎంసీల్లో అర టీఎంసీ నీరు డిండి ఎత్తిపోతలకు తరలిస్తారని తెలిపారు. డిండి ద్వారా నల్లగొండ జిల్లాలో 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి డిండికి గ్రావిటీ ద్వారా నీరు తేవాలని తొలి ప్రతిపాదన ఉంది. వట్టెం నుంచి ఎత్తిపోతల ద్వారా తేవాలనే రెండో ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. రెండింటిలో ఏదో ఒక ప్రతిపాదన ద్వారా డిండికి నీళ్లు రావడం ఖాయం అని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
కల్వకుర్తి లిఫ్ట్ పథకం రీ జనరేటర్ వాటర్ ద్వారా గత మూడు నాలుగు ఏండ్లుగా డిండి రిజర్వాయర్‌కు వరద వచ్చి అలుగు పోస్తుంది. దీంతో డిండి కింద ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఈ అలుగు నీటితో నక్కలగండిని నింపొచ్చు. నక్కలగండి 98 శాతం పూర్తి అయింది. గేట్లు బిగిస్తే నీరు నిల్వ ఉండనుంది అని మండలి చైర్మన్ తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తికి టెక్నికల్‌గా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ లోపు నక్కలగండికి డిండి రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించొచ్చని తెలిపారు. ఇక డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే గొట్టిముక్కల 98 శాతం, కిష్టారాంపల్లి, చర్లగూడెం 70 శాతం పూర్తి అయ్యాయి. వీటిని కూడా సహజ వరద ద్వారా కొంత నీటిని నింపొచ్చు. పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ పనులు కూడా మరింత వేగంగా పూర్తి కావచ్చు అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది అని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. దీని వాళ్ల తెలంగాణకు 9 ఏండ్లుగా తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. నదీ జలాల పంపకం పూర్తయితే ఇంకా వేగంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు మరో 100 టీఎంసీలు, సాగర్‌కు మరో 200 టీఎంసీల నీరు వస్తే నిండనున్నాయి. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం మరో 20, 30 టీఎంసీల నీరు వస్తే సాగర్ మొదటి జోన్ వరకు సాగునీరు ఇవ్వవచ్చు. ఇప్పటికే 30 టీఎంసీల వరకు అందుబాటులో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.