హైదరాబాద్,జనవరి 7(నమస్తే తెలంగాణ): ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి నడిపించడం అంతా సులభంకాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాతోపాటు కొత్త పార్టీ ఏర్పాటు, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలపై బుధవారం శాసనమండలి ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. సభలోలేని సభ్యుల పేర్లు ప్రస్తావించకూడదనే సంప్రదాయాన్ని అందరూ పా టించాలని మండలి చైర్మన్ హితవు పలికారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీల కు అవకాశం లేదని, ఇప్పుడున్న పార్టీలే చాలునని పేర్కొన్నారు. రాజకీయాల్లో మహిళల పట్ల వివక్ష ఉన్నదన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఇందిరాగాంధీ, జయలలిత, మమతాబెనర్జీ వంటి వారు గొప్ప నాయకులుగా ఎదిగారని, 33% రిజర్వేషన్లు వస్తే మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్య క్తం చేశారు. ఓట్ల కోసం డబ్బులు పంచే సంస్కృతి పై ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రస్తుతం ప్రజలు కేవలం అభివృద్ధిని చూసి ఓట్లు వేసే పరిస్థితిలో లేరని, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చారు. సంకాంత్రికి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్‌ఫ్రీ గురించి కాదు.. ముందుగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని పరోక్షంగా ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సూచించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. తన వయస్సు ఇంకా 71 ఏండ్లేనని, రాజకీయాల్లో తనలాంటి సీనియర్ల అనుభవం అవసరం ఉన్నదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల భాషపై గుత్తా అసహనం వ్యక్తంచేశారు. నాయకులు తమ వాగ్ధాటిని అదుపులో ఉంచుకోవాలని, భాష బాగుంటేనే ప్రజల్లో గౌరవం పెరుగుతుందని హితవు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన ‘బడవే’ వంటి మాటలు తాను వినలేదని, అయితే ఎవరైనా సరే సంయమనంతో మాట్లాడాలని సూచించారు.