హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ గురుకులాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టిన తరువాతే గురుకుల పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఇదే డిమాండ్‌తో మంగళవారం ‘చలో ప్రజాభవన్’కు ప్రభుత్వ గురుకులాల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ పిలుపునిచ్చింది.
జేఏసీ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదరాబాదరాగా గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురుకులాల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళన బాటపట్టాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ ఈ సందర్భంగా హెచ్చరించింది.
ఇప్పటికే పనిచేస్తున్న వారు నష్టపోతారు
గురుకుల పోస్టుల భర్తీని తప్పుబట్టడం మా ఉద్దేశం కాదు. ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకుండాపోస్టులు భర్తీ చేస్తే సీనియర్లు, ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 317 జీవో సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు.ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
– మామిడి నారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, టిగారియ సెంట్రల్ యూనియన్
సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుంది
ప్రమోషన్లు కల్పించకుండా రిక్రూట్మెంట్ చేపట్టడం వల్ల చాలా సర్వీస్ కలిగి ఉన్నప్పటికీ కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా మారే ప్రమాదమున్నది. సుదీర్ఘకాలంగా గురుకులాల్లో బదిలీలు చేపట్టకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో అనేకమంది సీనియర్లు పనిచేయాల్సి వస్తున్నది. ప్రమోషన్లు, బదిలీల తర్వాతే నియామకాలు చేపట్టాలి.
– ప్రభుదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టాఫ్ అసోసియేషన్