నమస్తే తెలంగాణ నెట్వర్క్: భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేయగా.. కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. తీవ్ర వరద నీటిలోనూ విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం పాతర్లపహాడ్‌లో జూలై 27న వరదతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఎలక్ట్రిక్ హెల్పర్ సంతోష్ సాహసం చేశారు. వరదనీటిలో ఈదుకుంటూ వెళ్లి, దెబ్బతిన్న విద్యుత్తు తీగలకు మరమ్మతులు చేసి విద్యుత్తును పునరుద్ధరించారు. జనగామ జిల్లా ధర్మాపురం ఊరచెరువు మధ్యలో 11 కేవీ హైటెన్షన్ వైర్లు తెగిపడగా, జూనియర్ లైన్మెన్ రహమాన్ రిపేరు పరికరాలతో సహా తెప్పపై వెళ్లి 11 కేవీ వైర్‌ను పోల్‌పై అమర్చారు.
బీఆర్ తండా, వ్యవసాయ బావులకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జంపన్న వాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం పూర్తిగా నీట మునిగింది. వరద తీవ్రతను ముందుగానే అంచనావేసిన స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు పాయం మీనయ్య.. 40 మంది విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే వసతి కల్పించి, భోజనం పెట్టారు. మీనయ్య సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. ఆపత్కాలంలో సమయస్ఫూర్తితో, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన ఈ ముగ్గురు సాహస ఉద్యోగులను పంద్రాగస్టున ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం తలచింది. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది.