హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్స్-2026లో మైనారిటీ గురుకుల విద్యాలయాల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు మించి కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్), నాన్ సీవోఈ కళాశాలలకు చెందిన 105 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 35 మంది అర్హత సాధించారు. ఇందులో ఏడుగురు 90 శాతానికిపైగా పర్సంటైల్, 16 మంది విద్యార్థులు 80 శాతానికిపైగా పర్సంటైల్ స్కోర్ పొందారు. ఓవరాల్‌గా జనరల్ క్యాటగిరీలో 93.42%, ఈడబ్ల్యూఎస్‌లో 82.42%, ఓబీసీలో 80.92%, ఎస్సీల్లో 63.9%, ఎస్టీల్లో 52.01% ఉత్తీర్ణత నమోదు చేశారు.
నిరుపేద మైనారిటీ వర్గాల పిల్లలకు కార్పొరేట్‌స్థాయి విద్యను అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. నాణ్యమైన ఫ్యాకల్టీని నియమించారు. నాణ్యమైన భోజనంతోపాటు మెరుగైన వసతులు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ. 1.25 లక్షల చొప్పున ఖర్చుచేస్తున్నారు. విద్యార్థులు సైతం అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌తోపాటు పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. వేలాదిమంది ఎప్‌సెట్‌లో సత్తాచాటి ఇంజినీర్లు, డాక్టర్లుగా ఉన్నతస్థాయిలో స్థిరపడుతున్నారు. అలాగే గ్రూప్స్, బ్యాంకింగ్ లాంటి ఉద్యోగాలు సాధిస్తున్నారు.