Gurukul Students | శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5: ‘సీనియర్ ఫ్యాకల్టీలను మార్చొద్దు.. మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొద్దు.. అని ఉపాధ్యాయుల దినోత్సవం రోజే గౌలిదొడ్డి గురుకుల కళాశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ ఐఐటీ ఇంటర్ బాలుర కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి, క్యాంపస్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.
గురుకుల విద్యాలయాల సెక్రటరీ ఈ విషయమై వెంటనే స్పందించాలని కోరారు. కొద్దిసేపటికే సమీపంలోని బాలికల గురుకుల విద్యార్థులు సైతం తరగతి గదుల నుంచి విద్యాలయం గేటు ముందు జర్నలిస్టు కాలనీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ కొత్తవారిని నియమించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా గురుకుల విద్యాలయాల సెక్రటరీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ విద్యార్థులను అణగతొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని తల్లిదండ్రులు ఆరోపించారు.