చండ్రుగొండ, ఆగస్టు 23: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల పర్యటనకు వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను గుర్రంగూడెం గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. గుర్రంగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశాల కోసం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాన్వాయ్ రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఆర్యూబీలో వర్షానికి నిలిచిన బుదర నీళ్ల వద్ద కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వర్షం వచ్చిన ప్రతిసారీ ఆర్యూబీ కింద నీళ్లు చేరి, రాకపోకలు నిలిచిపోతున్నాయని, గ్రామ రోడ్డు కూడా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా ఎన్నేండ్లకు ఈ సమస్యలను పరిష్కరిస్తారంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. వచ్చే నెలలో రోడ్డు మరమ్మతులు చేయించి, ఆర్యూబీ కింద నీరు నిల్వకుండా పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించి ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డుతొలిగారు.