హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్ చడూనీ స్పష్టంచేశారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీని పంజాబ్‌లో ఊరూరా విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్‌లోని లూధియానాలో రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గుర్నామ్‌సింగ్ చడూనీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా సాగుతున్నదన్నారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నారని, ఏ కారణంతో రైతు మరణించినా.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా పరిహారం అందుతున్నదని వివరించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తిచేసిందని చెప్పారు.
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తాము పర్యటించినప్పుడు కాళేశ్వరం అద్భుతాలను పరిశీలించామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిందని, దళితవర్గాల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. దళిత కుటుంబాలను వ్యాపార కుటుంబాలుగా మార్చడం ద్వారా వారి సాధికారతకు పాటుపడుతున్నదని చడూనీ పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు ప్రత్యేకించి రైతాంగానికి అమలవుతున్న పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్తోనే దేశంలో అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు దేశానికి ఏం చేశాయని గుర్నామ్‌సింగ్ ప్రశ్నించారు. 8 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే పాలసీగా పెట్టుకున్నదని ఆయన మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీ, పోర్టులు సహా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా మోదీ సర్కారు అమ్మేస్తున్నదని తీవ్రంగా దుయ్యబట్టారు.
మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదని, దాన్ని అడ్డుకోకపోతే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పంజాబ్‌లోని ఊరూరా బీఆర్ఎస్ విస్తరించాలని ఆకాంక్షించారు. త్వరలో ప్రతీ జిల్లాకు కన్వీనర్‌ను నియమిస్తామని, వారి నాయకత్వంలో తాలూకా, గ్రామస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు బీఆర్ఎస్ రూపంలో సరికొత్త సామాజిక విప్లవాన్ని చూడబోతున్నారని ఆయన పేర్కొన్నారు.