Gummadi Narsaiah | ఇల్లెందు, ఫిబ్రవరి 21 : ‘కేసీఆర్‌ది గడీల పాలన అంటూ నాటి ముఖ్యమంత్రిపై రేవంత్‌రెడ్డి నీలాపనిందలు మోపారు. తమది ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిని ఎవరైనా ఎప్పుడైనా కలవొచ్చంటూ ఊదరగొట్టారు. అదే ప్రజల దీవెనలతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నన్నే పట్టించుకోలేదు. తనను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక నాలుగుసార్లు వెళ్లా. తాజాగా రెండు రోజులపాటు సెక్రటేరియట్, సీఎం ఇంటి చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. ప్రజాసమస్యలపై వినతిపత్రాలు తీసుకునేందుకు సమయం ఇవ్వలేదు. మరి ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?’ అంటూ కమ్యూనిస్టు యోధుడు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలపై గుమ్మడి నర్సయ్యను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా అసలు వృత్తాంతాన్ని విశదీకరించారు.
గుమ్మడి నర్సయ్య: ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇల్లెందు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, సీతారామ ప్రాజెక్టు విషయంలో ఇల్లెందు నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యమంత్రికి వివరించి వినతిపత్రం అందించాలని అనుకున్నాం. అందుకోసమే అఖిలపక్ష నాయకులతో కలిసి సీఎంను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లా. కానీ పాతికేళ్లపాటు ప్రజల చేత ఎన్నికై ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడిన నాకు ఇప్పటి ముఖ్యమంత్రి కనీసం సమయం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రారంభిస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా. కానీ ఎంతలా ప్రయత్నించినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
గుమ్మడి : ఇల్లెందు నియోజకవర్గంలో అఖిలపక్ష పార్టీలైన సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నియోజకవర్గస్థాయి నాయకులం కలిసి బుధవారం (ఫిబ్రవరి 19) వెళ్లాం. అలాగే, కాంగ్రెస్ నుంచి కూడా బండారి మోహన్‌రావు మా వెంట వచ్చాడు.
గుమ్మడి: అఖిలపక్ష నాయకులమంతా సెక్రటేరియట్‌కు చేరుకున్నాం. ముఖ్యమంత్రి వద్దకు పంపించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరాను. ‘మీకు అపాయింట్మెంట్ లేదు. పంపించడం కుదరదు’ అని చెప్పారు. ‘కాకపోతే మధ్యాహ్నం తరువాత పంపిస్తాం’ అన్నారు. దీంతో సాయంత్రం వరకు అక్కడే వేచి చూశాం. సాయంత్రమైనా పంపలేదు. పైగా ‘రేపు సీఎం ఇంటి వద్దకు రమ్మన్నారు. అక్కడికి వెళ్లండి’ అని చెప్పారు. దీంతో గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి వద్దకు వెళ్లాం. ఆయన ఇంటి ముందే నిలబడి ఉన్నాం. వినతిపత్రం ఇచ్చేందుకు మేం వచ్చిన విషయాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాం. దీంతో ఆ సెక్యూరిటీ సిబ్బంది సీఎం పీఏ జైపాల్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ‘ఎవరెవరున్నారు?’ అని జైపాల్‌రెడ్డి అడిగారు. ‘చాలామంది ఉన్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా ఉన్నాడు’ అని సెక్యూరిటీ సిబ్బంది సమాధానమిచ్చారు. ఇంతలో సీఎం ఓఎస్డీ దినేశ్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ‘ముందే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఇప్పుడు పంపించడం కుదరదు’ అంటూ తేల్చిచెప్పారు.
గుమ్మడి: అదే సమయంలో సీఎం కాన్వాయ్ వస్తుండడాన్ని చూశాను. ముఖ్యమంత్రికి కనిపిద్దామని ముందుకు వెళ్లాను. కానీ సెక్యూరిటీ వాళ్లు నన్ను ముందుకు వెళ్లనీయలేదు. సీఎం నన్ను చూశాడో లేదో తెలియదు. కానీ సీఎం కాన్వాయ్ వెళ్లిపోయింది. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి ముఖ్యమంత్రులందరూ నాతో ఆత్మీయంగా ఉండేవారు. నేను ఓడిపోయిన సమయంలో కూడా వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు ఆప్యాయంగా పలుకరించేవాళ్లు. నేను వెళ్తే అపాయింట్మెంట్ లేకుండానే తమ చాంబర్లలోకి తీసుకెళ్లి సమస్యలన్నీ తెలుసుకునేవారు. వినతిపత్రాలు తీసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేసేవాళ్లు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం నన్ను కనీసం పట్టించుకోలేదు.
గుమ్మడి: రుణమాఫీ, రైతుభరోసా, సీతారామ నీళ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా. రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదని తెలుసుకున్నా. కేసీఆర్‌ది గడీల పాలన అంటూ అప్పట్లో ఇదే రేవంత్‌రెడ్డి నిందలు మోపేవారు. తమది ప్రజాపాలన అంటూ ఆయన సీఎం అయ్యాక గొప్పలు చెప్పుకున్నారు. ప్రజాపాలనలో ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి కలవొచ్చని, సమస్యలు చెప్పుకోవచ్చని ఊదరగొట్టారు. కానీ ఇది ప్రజాపాలన కాదని నా అనుభవంలో స్పష్టమైంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాకే సీఎం వద్ద ఇలాంటి పరాభవం ఎదురైంది. 14 నెలల కాంగ్రెస్ పాలనలో వారి ఏ ఒక్క హామీ కూడా అమలుకాలేదు. రుణమాఫీ అందరికీ అందలేదు.