హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఆలయాలు, విద్యాలయాలు, వైద్యశాలలకు సమీపంలో మాంసాహార వినియోగం/విక్రయాలపై ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. వాటికి వంద మీటర్లకు దూరంగా మాంసం దుకాణాలు ఉండే లా నిబంధనలు విధించాలని సూచించింది. మత విశ్వాసాలు, శుభ్రత, ట్రాఫిక్ సమస్య వంటివి కూడా పరిగణనలోకి తీసుకొని గైడ్‌లైన్స్ రూపొందించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హోం, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలకు నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని తమ వ్యాపార కార్యకలాపాల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మహారాష్ట్రకు చెందిన ఐబీపీన్ రాందాస్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు.