హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ డైట్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 211 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, మరో 28 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఏడాదిపాటు కొనసాగించేందుకు అనుమతిచ్చింది. ఆర్థికశాఖ సోమవారం జీవో జారీచేసింది. వీరితోపాటు గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న 173 మంది ఉద్యోగుల సేవలను ఏడాదిపాటు కొనసాగించేందుకు అనుమతినిస్తూ మరో జీవో జారీచేశారు.
‘స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లు రద్దుచేయండి’
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఈ నెలలో నిర్వహించతలపెట్టిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను రద్దుచేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి హేమచంద్రుడు, గౌరవాధ్యక్షుడు మురళీకృష్ణ, ముఖ్య సలహాదారు సత్యనారాయణ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వర్షాలు, సెలవుల నేపథ్యంలో ఇప్పటికే చదవులకు ఆటంకం కలిగిందని, టీఎల్ఎం మేళాలతో ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఎఫ్ఏ -2 పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కాంప్లెక్స్ మీటింగ్‌ల పేరుతో రెండు రోజుల విలువైన సమయం వృథా అవుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.