హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మళ్లీ గుడుంబా (నాటుసారా) గుప్పుమంటున్నది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో భారీగా గుడుంబా స్థావరాలు వెలిశాయి. బీఆర్ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ తెలంగాణలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించగా.. నేడు మారుమూల గ్రామాల్లోనూ సారా రక్కసి బుసలుకొడుతున్నది. ఎక్సైజ్ అధికారులు ఈ నెల 12 నుంచి 21 వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లే ఇందుకు నిదర్శనం. ఎక్సైజ్ శాఖ ఆదాయంపై నేరుగా దెబ్బతీస్తున్న సారాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు, కమిషనర్ సీ హరికిరణ్ ఇప్పటికే పలు సమావేశాల్లో తమ సిబ్బందిని ఆదేశించారు. దీంతో కొత్తగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి అవినాశ్ మొహంతి ఈ నెల 12 నుంచి 21 వరకు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. 651 మందిని అరెస్టు చేసి 119 వాహనాలను సీజ్ చేశారు.
నిందితులపై 841 కేసులు నమోదు చేశారు. 3,191 లీటర్ల సారా, 8,377 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 64,435 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పరిధిలో సారా కాసేవారిపై అత్యధికంగా 260 కేసులు నమోదు చేసి 206 మందిని అరెస్టు చేశారు. 1,400 లీటర్ల సాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ పరిధిలో 108 కేసులు నమోదు చేసి, 76 మందిని అరెస్టు చేశారు. 310 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పరిధిలో 86 కేసులు నమోదు చేసి, 58 మందిని అరెస్టు చేశారు. 260 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. ఆదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ రఘురాం పరిధిలో 80 కేసులు నమోదు చేసి, 76 మందిని అరెస్టు చేశారు. 298 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. అంతేకాకుండా ఈ స్పెషల్ డ్రైవ్‌లో 362.72 లీటర్ల ఎన్డీపీఎల్ లికర్, 114.32 కేజీల గంజాయి, 41 గ్రాముల ఎండీఎంఏ, 310 గ్రాముల కొకైన్, 6.3 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.