హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తేతెలంగాణ): ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె నోటీసు నేపథ్యంలో మంగళవారం విద్యానగర్లోని టీఎంయూ యూనియన్ ఆఫీస్లో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ విషయంలో ముందుచూపు లేకుండా సమ్మె నోటీసు ఇచ్చి కార్మికులను కొన్ని యూనియన్లు గందరగోళంలో పడేశాయని ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే నడపడంతో పాటు యూనియన్లను అనుమతించడం వంటి సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే కోడ్ ముగిసిన తర్వాత అన్ని యూనియన్ల నాయకులతో మాట్లాడి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇస్తామని పేర్కొన్నారు.