హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాసర్ కలిశారు. చేనేతపై జీఎస్టీని తొలగించాలని చేపట్టిన తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎంపీ సంజయ్ సింగ్.. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ చేనేత మహావస్త్ర లేఖపై సంతకం చేశారు. చేనేత వస్త్రాలపై పన్నులు వేయడం సరికాదని, ఈ విషయమై పార్లమెంటులో చర్చిస్తానని తెలిపారు.