హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దీంతో చాలా మంది ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. అధిక మోతాదులో వీటిని వినియోగించడం వల్ల శరీరంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇటీవల ‘మన్‌కీబాత్’లో ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కేంద్ర బడ్జెట్లో యాంటీ బయాటిక్స్‌పై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) విధించాలని వైద్య నిపుణలు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా హై-డోస్ యాంటీ బయాటిక్స్ వినియోగం కాస్తయినా తగ్గుతుందని పేర్కొంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల ప్రకారం యాంటీ బయాటిక్స్‌ను 3 క్యాటగిరీలుగా విభజించారు. యాక్సెస్ (తక్కువ మోతాదు యాంటీ బయాటిక్స్), వాచ్, రిజర్వ్ (హై-డోస్ యాంటీ బయాటిక్స్)గా వర్గీకరించారు. వీటిలో ‘యాక్సెస్’ యాంటీ బయాటిక్స్‌పై 5%, ‘వాచ్’ యాంటీ బయాటిక్స్‌పై 12%, ‘రిజర్వ్’ యాంటీ బయాటిక్స్‌పై 24% జీఎస్టీ విధించాలని, తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏఎంఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వినియోగించాలని కోరుతూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. యాంటీ బయాటిక్స్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఆధునిక వైద్యం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మన దేశంలో 20% మంది మాత్రమే ‘యాక్సెస్’ క్యాటగిరీ యాంటీ బయోటిక్స్‌ను, మిగతా 80% శాతం మంది ‘వాచ్’, ‘రిజర్వ్’ క్యాటగిరీ యాంటీ బయాటిక్స్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తున్నది. చాలా మంది దగ్గు, జలుబు లాంటి చిన్న సమస్యలకు సైతం నేరుగా యాంటీ బయోటిక్స్ వినియోగిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాతే రోగులకు యాంటీ బయాటిక్స్ ఇవ్వాలన్న నిబంధనలను అనేక మంది ఫార్మసిస్టులు, వైద్యులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో హై-లెవల్ యాంటీ బయాటిక్స్ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఏఎంఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించాలని వైద్యనిపుణలు సూచిస్తున్నారు.
హానికరమైన బాక్టీరియా, వైరస్లు, ఫంగస్, ఇతర పరాన్నజీవులు యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా నిరోధక శక్తిని పెంపొందించుకోవడాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఇది పెరిగితే ఇన్ఫెక్షన్లకు చికిత్స కష్టతరంగా మారుతుంది. వ్యాధి మరింత వ్యాప్తి చెంది ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం గొర్రెలు, మేకలు, పాడి పశువులు, కోళ్లలో ప్రతి చిన్న జబ్బుకూ విరివిగా యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో చికెన్, మటన్, పాలలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు పేరుకుపోతున్నాయి. ఆ ఉత్పత్తుల వినియోగంతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగి మానవాళికే ముప్పు ఏర్పడుతున్నట్టు పలు నివేదికలు నిగ్గుతేల్చాయి.