హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని అఖిల భారత పద్మశాలీ సంఘం సెంట్రల్ వరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఎంపీల సంతకాలు చేసిన చేనేత మహా వస్త్రలేఖను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆగస్టు 7న అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ పద్మశాలీ భవన్లో సోమవారం అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి అధ్యక్షతన నిర్వహించిన సెంట్రల్ వరింగ్ కమిటీకి హాజరైన వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేరోజున చేనేతపై జీరో జీఎస్టీ కోసం ఢిల్లీలో చేనేతల మహా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సమావేశానికి గౌరవాధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్వార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, తెలంగాణ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ బుధాటి రాధాకృష్ణయ్య, అఖిల భారత పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు ప్రహ్లాద్ సరుట్వార్, వద్ధి నర్సింహులు, కోంద్యాల్, షీలా చిన్న బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, కోశాధికారి కొకుల దేవేందర్, కోస్తాంధ్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, రాయలసీమ అధ్యక్షుడు కొంగతి లక్ష్మీనారాయణ, మహిళా కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజినీర్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండు రంగయ్య, రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్, మీడియా విభాగం అధ్యక్షుడు అవ్వారి భాసర్, పురోహిత విభాగం అధ్యక్షుడు గుర్రం బుజ్జన్న, పోపా అధ్యక్షుడు గంగాధర తిలక్, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు సోమచంద్రశేఖర్, నార్త్ కర్ణాటక అధ్యక్షుడు కాలప్ప, తమిళనాడు అధ్యక్షుడు రవీంద్రన్, పాండిచ్చేరి అధ్యక్షుడు రఘుపతితోపాటు ఆయా రాష్ట్రాల సీడబ్ల్యూసీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.