రామగిరి, జూలై 14 : గ్రూప్- 2, 3 పరీక్షలను వాయిదా వేయడంతోపాటు పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని గడియారం సెంటర్లో ప్లకార్డులతో నిరసన తెలిపి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. గ్రూప్-2, 3 పరీక్షలకు ఒకే సిలబస్ ఉన్నందున రెండు పరీక్షల నిర్వహణ మధ్య కనీసం రెండు నెలల గడువు ఉండాలని సూచించారు. అప్పుడే అభ్యర్థులు చదువుకోవడానికి సమయం ఉంటుందని తెలిపారు. ఎన్నికల ముందు గ్రూప్-2, 3కి రెండు వేల చొప్పున పోస్టులు పెంచి నోటిఫికేషన్ వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే మాట మార్చుతున్నదని మండిపడ్డారు.
‘పరీక్షలను వాయిదా వేయాలి’
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2, 3 పరీక్షలను నెలపాటు వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎల్ మూర్తి, కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీ వైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.