హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. దీని ప్రకారం 28,150 మందికే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఈసారి షార్ట్‌ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెప్తున్నారు.
మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ల వివరాల జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించిన కటాఫ్ మార్కుల వివరాలు త్వరలో అప్లోడ్ చేస్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగానే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని, అందుకోసం అన్నిరకాల ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతోపాటు తుది కీని కూడా అధికారులు విడుదల చేశారు. ఆ ప్రశ్నాపత్రంలో తప్పుగా వచ్చిన రెండు ప్రశ్నలను తొలిగించామని టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లు కూడా కరెక్టు అని ప్రకటించారు.
షార్ట్‌ఫాల్ విధానం అంటే?
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ షార్ట్‌ఫాల్ విధానాన్ని అమలుచేశారు. తొలుత 563 పోస్టులకు గాను మెరిట్ జాబితాలో 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఆ తర్వాత మరో 3,232 మందిని కమ్యూనిటీ షార్ట్‌ఫాల్ విధానంలో ఎంపిక చేశారు. అంటే మొత్తంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షలకు ఎంపిక చేశారు. మెరిట్ జాబితా ప్రకారం కమ్యూనిటీ రిజర్వేషన్ పోస్టుల్లో 1:50 నిష్పత్తికి తక్కువగా ఉంటే అదనంగా అదే కమ్యూనిటీ నుంచి ఎంపిక చేశారు. ఉదాహరణకు ఎ స్సీ క్యాటగిరీలో 70 పోస్టులుంటే, 1:50 నిష్ప త్తి ప్రకారం లెక్కిస్తారు. మొత్తంగా 3,500 మంది ఎస్సీ అభ్యర్థులకు నేరుగా మెయిన్స్‌కు హాజరయ్యేందుకు అవకాశం వస్తుంది.