Ground Water | హైదరాబాద్, మార్చి5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టం లోలోతుకు పడిపోతున్నది. వేసవికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరింత అధఃపాతాళానికి పడిపోనున్నది. ఒక్క నెలలోనే సగటున 1.22 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నాటికి 868 మి.మీ సగటు వర్షపాతానికి గాను 1,050 మి.మీ వర్షపాతం నమోదై 21 శాతం అధికంగా నమోదైంది. సగటు భూగర్భ జలమట్టం గత నెల ఇదేరోజున 7.06 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 8.68 మీటర్లుగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2 జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 0.32 నుంచి 5 మీటర్ల కంటే తక్కువ లోతులో ఉండగా, 22 జిల్లాల్లో 5-10 మీటర్లు మధ్య, మిగతా 9 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయని భూగర్భ జలశాఖ తాజా నివేదికే వెల్లడిస్తున్నది.
వాస్తవంగా చెరువులు, కాలువల ద్వారానే 30 శాతానికి పైగా భూగర్భజలాల వృద్ధి చెందుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపడం వల్ల మండు వేసవిలోనూ భూగర్భజల మట్టం పడిపోలేదు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఈ ఏడాది ప్రాజెక్టుల ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం, గతంలో లాగా చెరువులను క్రమంగా నింపకపోవడంతో భూగర్భజలమట్టం వేగంగా పడిపోతున్నట్టు తెలుస్తున్నది. ఈ దశలో రైతులు బోరు బావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో భూగర్భజల మట్టాలు వేగంగా తరిగిపోతున్నాయని భూగర్భజల శాఖ నివేదికే తేటతెల్లం చేసింది.
కృష్ణా బేసిన్లో మరింత దారుణం
రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ పరిధిలో ఈ ఏడాది ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లినా భూగర్భజలాలు మాత్రం పడిపోతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌తోపాటు వివిధ ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. కాలువల ద్వారా ఆశించిన స్థాయిలో నీటి విడుదల లేకుండా పోయింది. అయినా రైతులు బోరుబావులపైనే ఆధారపడి యాసంగి పంటలను వేశారు. దీంతో భూగర్భజలాలు త్వరితగతిన అడుగంటుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురిసిన కృష్ణా బేసిన్ పరిధిలోని జిల్లాల్లోనే భూగర్భజల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.17 మీటర్లు, నల్లగొండలో 0.94, వికారాబాద్ 1.38, మహబూబ్‌నగర్ 1.36, రంగారెడ్డి 1.09, నారాయణపేట 1.57, సూర్యాపేట 0.59, యాదాద్రి భువనగిరి 0,95 మీటర్ల చొప్పున లోతుకు భూగర్భజలాలు పడిపోవడం ఆయా జిల్లాల్లో పరిస్థితికి అద్దంపడుతున్నది.
గోదావరి బేసిన్లోనూ అంతంతే..
సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఆశించిన స్థాయిలో వరద వచ్చినా కూడా గోదావరి బేసిన్లోనూ నిరుడితో పోల్చితే వివిధ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి, అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోసి, తద్వారా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు. కానీ మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది ఆ పని చేయడం లేదు. చెరువులను, చెక్‌డ్యామ్‌లను నింపడం లేదు. ఫలితంగా బేసిన్లోనూ భూగర్భజలాలు గతనెలతో పోల్చితే త్వరితగతిన అడుగంటుతున్నాయి. అందుకు భూగర్భజలశాఖ నివేదికనే తెలుపుతున్నది. గోదావరి బేసిన్‌లోని మిగిలిన అన్నిజిల్లాలో ఈ ఏడాది భూగర్భజలాలు లోతుకు పడిపోవడం గమనార్హం.
2023లో మే గడిచినా.. తగ్గని జలాలు
2023లో మే నెల గడచినా భూగర్భజలాలు తగ్గలేదు. ఆ ఏడాది మే నెలలో 20 జిల్లాలో 0.03-2.39 మీటర్ల మేరకు భూగర్భజలాలు పెరిగాయని, అత్యల్పంగా మంచిర్యాలలో, అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో జలమట్టం పెరిగింది. కేవలం 13 జిల్లాల్లోనే స్వల్పంగా భూగర్భజలం తగ్గింది. మొత్తంగా 33 జిల్లాలకు 24 జిల్లాల్లో 5-10 మీటర్ల లోతులో, 8 జిల్లాల్లో 10-15 మీటర్ల లోతులో, ఒక జిల్లాలో 15 మీటర్లకు పైలోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నట్టు భూగర్భ జలశాఖ నివేదిక వెల్లడించింది.
30 లక్షల బోర్లు ప్రశ్నార్థకం
చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వలు లేక ఎక్కడికక్కడ బోర్ల ద్వారా 24 గంటలపాటు నీటిని తోడివేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గతంలో కంటే వేగవంతంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. జలరంగ నిపుణులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ దశలో నిన్నమొన్నటి వరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. పదుల సంఖ్యలో, వందల అడుగుల్లో బోర్లు వేయడం, నీటి ఊటలేక పడకపోవడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో అరెకరం, ఎకరా సాగు చేయడమే గగనంగా మారింది. గత ప్రభుత్వం క్రమంగా చెరువులను నింపడం ద్వారా 30 లక్షల బోర్ల కింద దాదాపు 45 లక్షల ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందింది. కానీ ప్రస్తుతం అదే ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అందులో సగం కూడా పంటలు పండని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు కొత్తగా బోర్లను వేయిస్తుండగా, మరికొందరు ఉన్న బోర్లను మరింత లోతుకు దించుతున్నారు. అయినా ఫలితం కానరావడం లేదు.
అప్పులు మీదవడ్డయ్!
నాకు ఆరెకరాల పొలమున్నది. రుణమాఫీ కాలే.. రైతుబంధు రాలే..అధి కారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలే.. విధిలేక అధిక వడ్డీలకు రెండు లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంట ఏసిన. పోయినసారి అప్పుచేసి రెండు బోర్లు ఏసిన. ఈ సారి భూమిల నీళ్లు లేక అవి ఎండిపోయినయ్. వాటి అప్పులు కూడా తీరలేదు. ఇప్పుడు పంటలు ఎండిపోయి పెట్టుబడులు సుత ఎల్లేటట్టు కనిపిస్తలేదు.
– సత్తయ్య, రైతు, తిప్పాయిగూడ, రంగారెడ్డి జిల్లా