PRLIS | మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాగునీటిరంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో అదేస్థాయిలో మరో సుజల దృశ్యం సాక్షాత్కరించింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు సాగునీరందించేందుకు తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్)లో భాగంగా నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద ఆదివారం నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్ డ్రైరన్‌ను అధికారులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ముందుగా పంప్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మొదటి పంప్‌ను ఉన్నతాధికారుల సమక్షంలో ఇంజినీర్ల బృందం విజయవంతంగా రన్ చేసింది. ఎలాంటి సాంకేతికలోపం లేకుండా డ్రై రన్ విజయవంతం కావడంతో ఇంజినీర్లు, పంప్‌హౌస్‌లో మోటర్లను బిగించిన బీహెచ్ఈఎల్ టెక్నికల్ బృందం సంబురాల్లో మునిగితేలింది. ఈ నెల 15న వెట్న్‌న్రు నిర్వహిస్తామని, పూర్తిస్థాయిలో పరీక్షించి.. 18వ తేదీలోగా నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లోకి నీటిని వదులుతామని అధికారులు వెల్లడించారు. డ్రై రన్ కోసం వారంపాటు ఇరిగేషన్, ట్రాన్స్‌కో, బీహెచ్ఈఎల్ టెక్నికల్ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంప్‌హౌస్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది.
వచ్చే యాసంగి నాటికి సాగునీరందిస్తాం: రజత్‌కుమార్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని రకాల అనుమతులు లభించాయని, ఒక నిర్ణీత లక్ష్యం పెట్టుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని రజత్ కుమార్ వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే యాసంగి నాటికి ఎత్తిపోతల పథకం ద్వారా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15న వెట్న్‌న్రు చేపట్టి 8 రోజుల వ్యవధిలో అంజనగిరి రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. అక్కడి నుంచి ఏదుల పంప్‌హౌస్‌లో పంపులను సిద్ధం చేసి.. అంజనగిరి నుంచి నీటిని ఏదుల రిజర్వాయర్‌కు తరలిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఏదుల రిజర్వాయర్‌ను 2 టీఎంసీలతో నింపుతామని చెప్పారు.
అక్టోబర్ 15వ తేదీలోగా కరివెన రిజర్వాయర్ వరకు జలాలను తరలిస్తామని వెల్లడించారు. అంజనగిరి, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను 2 టీఎంసీల చొప్పున 8 టీఎంసీలను ఎత్తిపోస్తామని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనుల్లో వేగం పెంచుతామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెడుతామని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని మోటర్లను పీఆర్ఎల్ఐలో వినియోగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పంప్‌లు చైనాలో, యురోపియన్ దేశాల్లో కూడా లేవని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ఈ పంపులను తయారు చేసిందని తెలిపారు. డ్రై రన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, కరివెన రిజర్వాయర్ ఎస్ఈ చక్రధర్, ఉద్దండాపూర్ ఈఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు రజత్‌కుమార్ అభినందన
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంపుహౌస్ వద్ద నిర్వహించిన డ్రై రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్, ఇంజినీరింగ్, టెక్నికల్ సిబ్బందిని స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అభినందించారు. డ్రై రన్ జరుగుతుండగా స్పెషల్ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పంప్‌ను పరిశీలించారు. ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా విజయవంతంగా పంప్ రన్ చేసిన ఇరిగేషన్ అధికారులను ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే స్ఫూర్తితో ఈ నెల 15వ తేదీలోగా వెట్న్ చేపట్టాలని ఆదేశించారు.