హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో చర్చించేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)సోమవారం సమావేశం నిర్వహించనున్నది. వరద ఉధృతంగా ఉన్నప్పుడు సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరవకుండా నిర్లక్ష్యం చేసినందునే ప్రాజెక్టుకు గండి పడిందని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గోదావరి బేసిన్లో ఇరు రాష్ర్టాలకు సంబంధించి ఉన్న ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు పునరుద్ధరణకు గతంలోనే జీఆర్ఎంబీ ప్రతిపాదనలు చేసింది. నిధుల అంచనా వేసింది. తాజాగా అదే ప్రాజెక్టుకు గండిపడిన నేపథ్యంలో మరమ్మతులు, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. 6న సమీకృత సీతారామ ప్రాజెక్టు అనుమతుల అంశంపైనా సమావేశంలో చర్చించనున్నది.