హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారని డిప్యూటీ సివిల్ సర్జన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డీఎంహెచ్‌వోలుగా నియమించడంలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎంబీబీఎస్ వైద్యులను డీఎంహెచ్‌వోలుగా నియమించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా, అమలు చేయడం లేదంటున్నారు.
స్పెషాలిటీ ఆధారిత ప్రమాణాలను ప్రవేశపెట్టి సీనియర్ వైద్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సివిల్ సర్జన్లను కాదని ఎస్పీఎం వంటి స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదవులు కట్టబెడుతున్నారని పేర్కొంటున్నారు. వైద్యులు సివిల్ సర్జన్‌గా పదోన్నతికి 25 ఏండ్లు పడుతుందని, స్పెషలిస్టు సివిల్ సర్జన్లు ఐదారేండ్లలోపే డీఎంహెచ్వోలు అవుతున్నారని వాపోతున్నారు. ఈ వివక్షను వెంటనే నిలపి పదోన్నతులు కల్పించాలని వైద్యశాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.