హైదరాబాద్, జనవరి 11 ( నమస్తే తెలంగాణ): గ్రీన్కో అనేది ప్రపంచంలోనే లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన అతిపెద్ద గ్రీన్కో సోలార్ పార్క్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను శనివారం ఏరియల్ వ్యూ ద్వారా, రోడ్డు మా ర్గాన పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం అనుమతితో 365 హెక్టార్ల అటవీ భూమిని గ్రీన్కో కంపెనీ కొనుగోలు చేసిందని, అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. గ్రీన్కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరున్నదని, దేశంలో రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడుతున్నదని వివరించారు. ఏపీలో రూ.35 వేల కోట్ల పెట్టుబడి పెట్టిందని, ఇప్పటికే 12 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని వెల్లడించారు. సోలార్ పార్క్ ప్రాజెక్టు మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తున్నారని, ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదని తెలిపారు. గ్రీన్కో కంపెనీ పిన్నాపురంలో ఇప్పటికే రూ. 12 వేల కోట్ల పెట్టుబడి పెట్టిందని, మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని తెలిపారు. మొత్తంగా 50 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న గ్రీన్కో కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.