తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే కుట్రకు కేంద్రం, ఏపీ సర్కార్ కుయుక్తులు పన్నుతుండగా, రేవంత్ సర్కార్ ఇందులో భాగస్వామ్యమవుతున్నది. జల వివాదాల పరిష్కారం పేరిట వచ్చేనెల 7న ఢిల్లీలో నిర్వ హించే సమావేశం బనకచర్ల ప్రాజెక్ట్‌కు పచ్చ జెండా ఊపేందుకేనని తెలుస్తున్నది. తెలంగా ణలో కీలక అధికారులకు ఈ భేటీలో చోటు దక్కకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. తాజాగా మళ్లీ ఉన్నపళంగా సెప్టెంబర్7వ తేదీన భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అది జల వివాదాల పరిష్కారం కోసం కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు కోసమేనని స్పష్టమవుతున్నది. ప్రాజెక్టుపై కర్ణాటక, తెలంగాణ అంగీకారం కోసమే ఇంతకాలం తాత్సారం చేసినట్టు స్పష్టమవుతున్నది. ఇటీవల చర్చల్లో ఇరు రాష్ర్టాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజాగా భేటీ ఖరారైంది. అదీగాక రాష్ట్ర విభజన నాటినుంచీ ఇరు రాష్ర్టాల మధ్య జల వివాదాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ అనేక డిమాండ్లను ముందుపెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర్చలు చేశారు. పలుమార్లు కేంద్రానికి నివేదించారు. కానీ, ఎన్నడూ కేంద్ర జల్‌శక్తి శాఖ పరిష్కారం కోసం చొరవ చూపలేదు. ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపెట్టి దాటవేసింది. గత భేటీలో అదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సైతం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7న భేటీ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం గోదావరి-కావేరి (జీసీ) లింకు ముసుగులో ఏపీ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆటంకాలు తొలగిచేందుకేనని తేటతెల్లమవుతున్నది.
గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను కొల్లగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరమీదికి తెచ్చింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) తదితర సంస్థలతోపాటు కర్ణాటక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ సర్కార్ సైతం మొక్కుబడిగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా 2025 జూలైలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుతోపాటు ఇతర జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని నిర్ణయించడం, ఆ తరువాత సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో 2026 జనవరిలో కమిటీని ఏర్పాటు చేయడం, అది 30వ తేదీన భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బనకచర్లతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమకున్న కీలక నీటి సమస్యలను సీడబ్ల్యూసీకి సమర్పించాలని, అదేవిధంగా జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ (గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు) సైతం తమకు సంబంధించిన అంశాలపై సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. రాష్ర్టాలు నివేదించిన అంశాలను పరస్పరం అందజేయాలని, ఒక రాష్ట్రం నివేదించిన అంశాలపై మరో రాష్ట్రం తన అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని, సహేతుకమైన కారణాలను సైతం వారంలోగా వివరించాలని, తదుపరి రాబోయే 15 రోజుల్లో కమిటీ మరోసారి భేటీ కావాలని ఆ సందర్భంగానే నిర్ణయించారు. దాదాపు ఏడు నెలలు గడచిపోయాయి. ఇప్పటివరకూ మళ్లీ జల వివాదాల ఊసెత్తలేదు. ఎజెండా అంశాలు ఏమిటనేదీ వెల్లడించలేదు. కానీ, ఉన్నపళంగా సెప్టెంబర్ 7న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కమిటీ ప్రకటించింది.
ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలకు ప్రధాన కారణం కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి వాటాలు ఖరారు కాకపోవడమే. ఈ విషయాన్ని కమిటీ నిర్వహించిన భేటీలో కేఆర్ఎంబీ తేల్చిచెప్పింది. గోదావరి ట్రిబ్యునల్ బేసిన్‌లోని నీటి లభ్యతను పరిమాణాత్మకంగా నిర్ధారించలేదని, బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటి మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల మధ్య జరిగిన పలు ఒప్పందాలను పరిగణనలోకి తీసుకునే 1980లో అవార్డును ప్రకటించిందని సీడబ్ల్యూసీ సైతం వెల్లడించింది. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్-1 కేటాయింపులే అమల్లో ఉన్నాయని, ట్రిబ్యునల్-2 అవార్డు ఇంకా అమల్లోకి రాలేదని, ఏపీ, తెలంగాణ మధ్య వాటాల పంపిణీ అంశంపై విచారణ కొనసాగుతున్నదని తెలిపింది. అదే భేటీలో కేఆర్ఎంబీ పలు కీలక సమస్యలు లేవనెత్తింది.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కచ్చితమైన, ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల కేటాయింపు జరుగాల్సి ఉన్నదని, లోటు వర్షపాతం సమయంలో నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్ ప్రొటోకాల్‌ను రూపొందించాల్సి ఉన్నదని, అంతేకాకుండా ప్రాజెక్టులు ప్రారంభించిన సమయానికి, ప్రస్తుత నిర్మాణాల్లో చాలా మార్పులు వచ్చాయని, అందుకు శ్రీశైలం ప్రాజెక్టు ఉదాహరణ అని బోర్డు పేర్కొన్నది. ఆయా ప్రాజెక్టుల మార్పులకు అనుగుణంగా నిర్దేశించిన గడువులోగా తిరిగి అనుమతులు పొందాలని, విభజన చట్టంలోని షెడ్యూల్-1లో ప్రతి ప్రాజెక్టుకూ టీఏసీ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2104కు సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖ దాదాపు నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిందని, అవన్నీ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయని, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులు, ఔట్లెట్లను బోర్డుకు అప్పగించలేదని వెల్లడించింది. ట్రిబ్యునల్ అవార్డు రాకుండా, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా నీటి నియంత్రణ సాధ్యం కాబోదని కరాఖండిగా కేఆర్ఎంబీ తేల్చిచెప్పింది. టెలీమెట్రీల ఏర్పాటును సైతం అప్పటివరకు వాయిదా వేయాలని సూచించింది. ఇప్పటికీ ఆయా సమస్యలు అలాగే ఉన్నాయి. అయినప్పటికీ, తాజాగా ఉన్నపళంగా మరోసారి భేటీ ఏర్పాటు చేయడం బనకచర్లకు ఆమోదం కోసమేనని స్పష్టమవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ కేవలం బనకచర్ల ప్రాజెక్టుపై సయోధ్య కోసమేననే అభిప్రాయాలు మొదటినుంచీ వ్యక్తమవుతున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, సమావేశాలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. గోదావరి నీటిలభ్యత, వరద జలాల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరుకు నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ప్రాజెక్టును ప్రీఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)ను సైతం పరిశీలించలేమని తిప్పిపంపాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర జల్‌శక్తి శాఖ రంగంలోకి దిగింది. బనకచర్ల ప్రాజెక్టును ఏకంగా గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగానే చేపట్టేందుకు నిర్ణయించింది. కేంద్ర సంస్థలకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖనే ప్రత్యేకంగా వేర్వేరుగా, గుట్టుగా ఆయా ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించింది.
రాష్ర్టాలతో మధ్యవర్తిత్వానికి నేతృత్వం వహించేందుకు కేంద్రమే సిద్ధమైంది. తెలంగాణతో చర్చల కోసం ఒక కమిటీని, కర్ణాటకతో చర్చల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తొలుత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏపీతో ఎన్వోసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్)ను మంజూరు చేయిస్తామని ప్రతిపాదనలు పెట్టగా, కుట్రలో భాగమైన చంద్రబాబు చేలా రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం అందుకు అంగీకారం తెలుపుతున్నది. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతోపాటు ఏపీ మళ్లించే జలాల్లో తమకు 112 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన కర్ణాటకను సైతం మెత్తబడేసింది.
తుంగభద్ర రిజర్వాయర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నిర్మించనున్న నావలి రిజర్వాయర్ విస్తరణకు, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వేలాది కోట్ల నిధులు మంజూరు చేస్తామని వరాలు కురిపించింది. దీంతో కర్ణాటక సర్కార్ సైతం అంగీకరించింది. మొత్తంగా బనకచర్లకు అడ్డంకులన్నీ తొలగించి రాష్ర్ర్టాలను కేంద్రమే సూత్రప్రాయంగా అంగీరింపజేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాలపై సంతకాల చేయడమే మిగిలిందని సమాచారం. ఆమోదముద్ర లభించిన నేపథ్యంలోనే ఏడునెలల అనంతరం ఉన్నపళంగా మళ్లీ కమిటీ భేటీ ఏర్పాటైందని తేటతెల్లమవుతున్నది..
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో 15మందితో ఏర్పాటుచేసిన కమిటీ 7వ తేదీన ఢిల్లీలో రెండోదఫా భేటీ కానున్నది. ఈ మేరకు సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ సీఈ రాకేశ్‌కుమార్ ఇప్పటికే సమాచారం అందజేశారు. మొదటి దఫా సమావేశంలో చర్చించిన అంశాలపై తదుపరి సమావేశం ఉంటుందని మాత్రమే వెల్లడించారు.
ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్1న ఢిల్లీలో కీలక సమావేశం కొనసాగనున్నది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీ సేవాభవన్‌లో ఈ సమావేశం కొనసాగనున్నది. తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ్మిడిహట్టి బరాజ్ అనుమతులు, తదితర అంశాలపై చర్చించనున్నారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌ను 148 మీటర్లతో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా జలాలను తీసుకోవడం సాధ్యమని, ఈ నేపథ్యంలో 152 మీటర్ల ఎత్తుకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు మహారాష్ట్రతో చర్చించి ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నది. తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని, అందుకోసం ఆ రాష్ట్రంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తరువాత కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా భేటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది.
తెలంగాణ, ఏపీ జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సాంకేతిక నిపుణుల కమిటీలో తెలంగాణ కీలక అధికారులకు చోటు కల్పించలేదని తెలుస్తున్నది. కమిటీలో తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున, అదేవిధంగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), సీడబ్ల్యూసీ సీఈ సభ్యులుగా మొత్తంగా 15 మందిని కమిటీలో నియమించింది. ఈ కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నుంచి అధికారులకు చోటు కల్పించకపోవడంపై అనాడే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇరిగేషన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇంజినీర్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వాస్తవంగా నదీ జలాలకు సంబంధించి వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టులు తదితర కీలక అంశాలను అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. సీఈతోపాటు ఎస్ఈ, గోదావరి, కృష్ణా బేసిన్లకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్లు, ఈఈలు కీలకంగా వ్యవహరిస్తారు. కోర్టు పిటిషన్లు, ట్రిబ్యునల్‌లో తెలంగాణ తరపున బలమైన వాదనలను వినిపించడంలో ఆ విభాగం అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు.
అయితే 15 మంది కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులకు ఏ ఒక్కరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం. ఏపీ జల వనరుల విభాగం సీఈని సదరు కమిటీలో కేంద్రం చేర్చింది. తెలంగాణ నుంచి కేవలం ముగ్గురు ఐఏఎస్‌లు, ఈఎన్సీని మాత్రమే కమిటీలో చేర్చింది. ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే ముందస్తు కుట్ర ప్రకారమే కీలక అధికారులకు చోటు కల్పించలేదని అర్థమవతున్నది.