హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా.. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని 540 పొల్యూషన్ గ్రిడ్లుగా విభజించింది. ఔటర్ రింగురోడ్డు లోపలి ప్రాంతాలను 2/2 చదరపు కిలోమీటర్లకు ఒక గ్రిడ్ చొప్పున విభజించారు. తొలుత ఒక్కో గ్రిడ్‌లో నమోదవుతున్న వాయు కాలుష్య తీవ్రతలు, కాలుష్య కారకాలపై సమగ్రంగా అధ్యయనం చేయిస్తున్నారు. అనంతరం గ్రిడ్ వారీగా పర్యావరణ ప్రణాళికను రూపొందించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. గ్రేటర్లో కాలుష్య కారకాల గుట్టును తేల్చేందుకు ఐఐటీ కాన్పూర్ చేపట్టిన అధ్యయనం ముగింపు దశకు చేరుకుంది. వాయు కాలుష్య కారకాలైన దుమ్ముధూళి కణాలు, వాయువులు, అస్థిర కర్బన సమ్మేళనాలు (వీవోసీ), ఉద్గారాలు ఎక్కడి నుంచి గాలిలో చేరుతున్నాయో అధ్యయనం చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ముఖేష్‌శర్మ నేతృత్వంలోని బృందం ఇటీవల తమ అధ్యయనంపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. నెల రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని ఐఐటీ కాన్పూర్ అధికారులను కోరారు.
కాలుష్య కారకాలు..
పొల్యూషన్‌కు సొల్యూషన్స్ ఇవే..
కాలుష్యాన్ని అదుపుచేసేందుకు సమస్య తీవ్రతను బట్టి ఒక్కో గ్రిడ్‌కు ఒక్కో పర్యావరణ ప్రణాళికను రూపొందిస్తారు. ద్విచక్రవాహనాలు అధికంగా తిరిగే ప్రదేశాలు, బేకరీలు, రెస్టారెంట్లు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తారు. దీంతో ఈ ఏ గ్రిడ్‌లో అత్యధిక కాలుష్యం నమోదవుతున్నదో నిర్దిష్టమైన సమాచారం లభిస్తుంది. కాలుష్యం అధికంగా నమోదయ్యే గ్రిడ్లను ప్రాధాన్యంగా తీసుకొని పర్యావరణ ప్రణాళికలు అమలుచేస్తారు.
ఒక గ్రిడ్‌లో రోడ్ల నుంచి దుమ్ముధూళి కణాలు అధికంగా ఉన్నట్టు తేలితే అక్కడ కొత్త రోడ్లు వేసి అదుపుచేస్తారు.
ఒక గ్రిడ్‌లో పారిశ్రామిక కాలుష్యం అధికంగా ఉంటే పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించే ఉపకరణాలు బిగించుకోవాలని ఆదేశాలిస్తారు.
జంక్షన్లల్లో ట్రాఫిక్ జామ్‌ల కారణంగా కాలుష్య తీవ్రతలు నమోదైతే యూటర్న్లు, లెఫ్ట్టర్న్లు ఏర్పాటు చేసి, బస్స్టాండ్లు, ఆటోస్టాండ్లను మరోచోటికి మారుస్తారు.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రో గ్రామ్‌లో భాగంగా గతేడాది రూ. 234 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం రూ. 180 కోట్లు కేటాయించారు. ఆ నిధులను ప్రాధాన్య క్రమంలో వా డేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.