హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖ పరిధిలోని ఏడు జోన్ల పరిధిలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగోన్నతి పొందిన 26 మందికి ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కొండాసురేఖ అందజేశారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి అర్చక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, దేవాదాయశా ఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ తరఫున కీలక నిర్ణయాలు ప్రకటించారు.
అర్చక ఉద్యోగులు రిటై ర్ అయిన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీని రూ.8లక్షల నుంచి రూ.12లక్షలకు పెంచుతున్నామని, ఇందులో 30 ఏండ్లకు పైగా సర్వీసు ఉన్నవారికి రూ. 12లక్షలు, 25ఏండ్లకు పైగా సర్వీసు ఉన్నవారికి రూ.10లక్షల గ్రాట్యుటీ ఇస్తామని తెలిపారు. ఉపనయనానికి సంబంధించి గతంలో రూ. 50వేలు ఇ స్తుండగా, దానిని రూ.లక్షకు పెంచారు. ధూప దీప నైవేద్య అర్చకులు ఎవరైనా అకస్మాత్తుగా, సాధారణంగా మరణిస్తే రూ.4 లక్షల గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి పీఎస్ సోమరాజు, ఏడీసీ శ్రీనివాసరావు, అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.