వెల్గటూర్, డిసెంబర్ 8: నానమ్మ కర్మకాండలకు వెళ్లి సమీపంలోని బోరు వద్ద స్నానం చేస్తుండగా, విద్యుత్తు షాక్ తగిలి మనుమడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌రావుపేటలో రెండ్రోజుల కిందట పిట్టల భీమక్క (80) అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం మూడో రోజు కావడంతో గ్రామ శివారులోని శ్మశాన వాటికకు వెళ్లి కర్మకాండలు నిర్వహించారు. అక్కడ స్నానం చేసేందుకు నీటి సౌకర్యం లేకపోవడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లారు. ఈ క్రమంలో మోటర్‌కు విద్యుత్తు సరఫరా కావడంతో పిట్టల మొగిలి (35) సోదరుడు మల్లేశ్, కొడుకు రిషికి షాక్ కొట్టింది. వారిని తప్పించేందుకు మొగిలి వెళ్లగా షాక్‌కు గురై కుప్పకూలి పోయాడు. అక్కడ ఉన్నవారు మొగిలికి సీపీపీ చేసి అంబులెన్సులో కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రిషికి తీవ్ర గాయాలవడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.