నర్సింహులపేట, ఏప్రిల్ 4: రైతులు తమ కుటుంబ సభ్యులతో సమానంగా పశువులను ఎడ్లు ఆవులను పెంచుకుంటారు. తాను తిన్న తినకపోయినా పశువులకు మాత్రం సమయానికి గడ్డి వేయడం, నీళ్లు పెట్టడం చేస్తారు. విశ్వాసం, నమ్మకానికి నందిగా వ్యవసాయంలో తోడుగా ఉండే ఎడ్లను భగవంతుడి స్వరూపంగా భావిస్తుంటారు. తమ ఇంట్లో సొంత సభ్యుడిలా ప్రేమగా చూసుకుంటారు. ఒక రోజు కనపడకపోతే అల్లాడిపోతుంటారు. మూగజీవాలు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన ఇంతా ఇంతా కాదు. కొంతమంది తమ పశువులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలోని రూప్లాతండా జీపీ పరిధి బీల్యా తండాలో జరిగింది. వృద్ధాప్యం కారణంగా దేవుడి కోడె చనిపోవడంతో డప్పు చప్పుళ్లు, డీజే నృత్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
బీల్యా తండాకు చెందిన కస్నానాయక్ అనే వ్యక్తి 22 ఏళ్ల క్రితం తన తండ్రి బీల్యానాయక్ పేరతో కోడెను (దేవుడి కోడె) ఊరు కోసం ఇచ్చారు. వృద్ధాప్యం కారణంగా అది గురువారం చనిపోయింది. దీంతో తండావాసులు నీళ్లు ఆరగిస్తూ, డీజే నృత్యాలతో ఊరేగించారు. అనంతరం తండాలో ఉన్న బీల్యానాయక్ గుడి వద్దే దానిని ఖననం చేశారు. శుక్రవారం ఉదయం గిరిజన సాంప్రదాయాల ప్రకారం బోగు బండారు (నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకం) కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. తండావాసులంతా వ్యవసాయ పనులకు వెళ్లకుండా మనిషి చనిపోయిన దాని కంటే ఎక్కువగా అందరూ గిరిజన సాంప్రదాయం ప్రకారం, అంతిమ సంస్కారం నిర్వహించారు. 20 ఏండ్లుగా దేవుడు కోడెను రైతులు తమ పొలాల్లోకి వచ్చినా ఏమీ అనేవారు కాదని, పిల్లలు సైతం దగ్గరికి వెళ్లినా వారిని పొడవడం లాంటిది చేసేది కాదని తండావాసులు కన్నీరు మున్నీరయ్యారు.