నాగర్‌కర్నూల్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక అభాసు పాలైన ప్రభుత్వం.. అరకొరగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం సక్రమంగా నిర్వహించలేకపోతున్నది. తాజాగా ఐకేపీ(IKP center) ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం అక్రమార్కుల చెంతకు చేరడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్‌కు స్థానిక రైతులు వడ్లు తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 320 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఆన్లైన్లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. అయితే వడ్ల లారీ(Grain lorry) ఎంతకూ సీతారామాంజనేయ రైస్ మిల్లుకు చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు. అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్‌తో కుమ్మక్కై రాత్రికి రాత్రే వట్టెం ఏరియాలోని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన తుల్జా భవాని అనే రైస్ మిల్లుకు అక్రమంగా ధాన్యం తరలించినట్లు తెలిసింది. ఇది కాస్త బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు వార్నింగ్ ఇవ్వడంతో మిల్లు నుంచి లారీల్లో లోడ్ చేసుకుని గుడిపల్లి రైస్ మిల్కు తరలించారు.