హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ సమావేశాలకు అనువైన హైదరాబాద్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) సమావేశాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీ20 ఆర్థిక సదస్సులో భాగంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతున్న సమావేశాలకు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆర్థిక అంశాల్లో అందరికీ చోటు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అనుభవాలను పంచుకున్నాయి. ప్రపంచ దేశాల రుణభారాన్ని తగ్గించడం, స్వదేశాలకు చేసే చెల్లింపులకు అయ్యే ఖర్చు తగ్గించడం, ఆయా దేశాలకు మేలు జరగాలంటే సక్రియాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాల అవసరం వంటి అంశాల గురించి చర్చించారు. మంగళవారంతో జీపీఎఫ్ఐ సమావేశాలు ముగియనున్నాయి.