MLA Beerla Ilaiah | హైదరాబాద్, జులై 8(నమస్తే తెలంగాణ): తానూ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన మనసులోని మాటను వెల్లబుచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. గొల్లకుర్మలకు ప్రాతినిథ్యం లేకుండా ఏనాడూ మంత్రివర్గం లేదని, కానీ తొలిసారిగా తమ వర్గాన్ని ఈ సారి విస్మరించారని, ఈ కోటాలో తనకు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరారు.
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారని, భువనగిరి పరిధిలో ఒకరూ లేరని, ఈ కోటాలోనైనా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. కాంగ్రెస్‌ను గొల్లకుర్మలు ఆదుకున్నారని, కాంగ్రెస్‌కు పోలైన ఓట్లలో 53% ఓట్లు తమవేనని చెప్పుకొచ్చారు. ఆంధ్రలో గొల్లకుర్మ వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారని, తెలంగాణలో ఒక్కరిని కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి వర్గంలో చోటు కల్పించడంతోపాటు ఒక ఎమ్మెల్సీ, ఒక సలహాదారు పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వరింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎం పీఆర్వో పోస్టులు తమ వర్గానికి ఇవ్వాలని ఐలయ్య డిమాండ్ చేశారు.