హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సర్కారు బడులు, బడ్జెట్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్ల పేరుతో విద్యలోకి చొరబడిన అంతరాలను తొలగించాలని తెలంగాణ పౌరస్పందన వేదిక కోరింది. రాష్ట్రంలో ఉచితంగా చదువు చెప్పే బడులతోపాటు రూ. 20 వేల ఉంచి రూ.6 లక్షల ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్లు కూడా ఉన్నాయని వక్తులు పేర్కొన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలని, చదువులో ఈ అంతరాలు పోవాలని నినదించారు. తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో గురువారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పాఠశాల విద్యపై చర్చాగోష్టి నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ అమెరికాలో 91శాతం, చైనాలో 100 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని తెలిపారు. మన దగ్గర మాత్రం విద్యారంగం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. సర్కారు స్కూళ్లను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం, లక్ష్మణ్‌రావు, మస్తాన్‌రావు, జితిన్ తదితరులు పాల్గొన్నారు.