హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెంగాణ): హైదరాబాద్ నగరానికి నాలుగువైపుల ఏర్పాటు చేయనున్న సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ ర్మాణ పనులకోసం తెలంగాణ సర్కార్ రూ.2679 కోట్లు కేటాయిస్తూ గురువారం జీవో జారీచేసింది. ఎల్బీనగర్లో నిర్మించతలపెట్టిన సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు, సనత్‌నగర్‌లో నిర్మించే దవాఖానకు రూ.882కోట్లు, అల్వాల్ దవాఖానకు రూ.897 కోట్లు కేటాయించారు. మరోవైపు టిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వీటి నిర్వహణ డైరెక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. టిమ్స్ డైరెక్టర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు.. వైద్యులు మొదలు ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను చేపడుతుంది. ప్రభుత్వం బడ్జెట్‌ను నేరుగా టిమ్స్‌కు కేటాయిస్తుంది. ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా సమయంలో ఏర్పాటుచేసిన గచ్చిబౌలిలోని టిమ్స్‌తో పాటు గడ్డిఅన్నారం పండ్లమార్కెట్, అల్వాల్-ఓఆర్ఆర్ మార్గంలో, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన ప్రాంగణంలో నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నాలుగు దవాఖానలను మరింత బలోపేతం చేస్తారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇవి సేవలు అందించనున్నాయి.
గ్రేటర్ చుట్టూ నిర్మించనున్న నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు కూడా వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ముఖ్యంగా అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. అంతేకాకుండా వైద్యసేవలు సకాలంలో పొందే వీలుంటుంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ దవాఖాన వల్ల నల్లగొండ, వరంగల్, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల ప్రజలకు, గచ్చిబౌలిలోని టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు చేరువ కావడంతో పాటు సులభంగా దవాఖానలకు చేరుకునే వీలుంటుంది. ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రేటర్ సరిహద్దులో ఉన్న నూతన సూపర్‌స్పెషాలిటీ దవాఖానల ద్వారా సేవలు పొందే వీలుంటుంది.
నగరం చుట్టూ మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను మంజూరు చేయడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్ ప్రాంతాల్లో మంజూరు చేసిన స్పెషాలిటీ దవాఖానలతో పాటు గచ్చిబౌలి టిమ్స్ వల్ల ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఆకాంక్షించారు.