హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం జల్గావ్ సమీపాన జైన్‌హిల్స్‌లో ఉద్యాన సాగు, మామిడి ప్రాసెసింగ్ సెంటర్, టిష్యూ కల్చర్ మొక్కల తయారీ, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ తయారీ యూనిట్, సోలార్ పంపుసెట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జైన్ సంస్థ స్ఫూర్తితో తెలంగాణలో పంటల మార్పిడి దిశగా రైతులను నడిపిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన జల్గావ్ మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూకల్చర్ ల్యాబ్ దేశానికే గర్వకారణమని చెప్పారు. అంతకుముందు గాంధీ తీర్థ్ మ్యూజియాన్ని మంత్రి బృందం సందర్శించింది. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.