హైదరాబాద్: నగరంలోని జలవిహార్‌లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పాల్గొన్నారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో దసరా సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు గొప్పగా జరిగాయన్నారు. రాజ్‌భవన్‌లో కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకున్నామన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 16 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. అలయ్ బలయ్.. తెలంగాణ సంస్కృతికి అద్దంపడుతున్నదని వెల్లడించారు.
అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు పాల్గొన్నారు.