హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సామాజిక, ఆహార అలవాట్లతోనే పోషకాహార లోపాన్ని నివారించవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా ‘అందరికీ పోషకాహారం’ అనే అంశంపై హైదరాబాద్లోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో 5 రోజులపాటు కేంద్ర సమాచార సంస్థ నిర్వహిస్తున్న అవగాహన సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. భిన్న సంసృతులు, భాషలతో కూడిన మన దేశంలో ప్రజలందరికీ పోషకాహార సమాచారాన్ని చేరవేయడం సవాలేనని పేర్కొన్నారు. సృజనాత్మక వ్యూహాలతో ఈ సవాలును అధిగమించడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని చెప్పారు. సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు, స్థూల-సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం, ఆహారంలో పోషకాలను గుర్తించే విధానాలపై ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పీఐబీ, సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతిపాటిల్, తెలంగాణ మహిళా వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ ఎమ్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.
సూరం చెరువుపై సర్వే క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/మహేశ్వరం: సూరం చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో నీటిపారుదలశాఖ ఇంజినీర్లు సోమవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎస్ఈ హైదర్ఖాన్ సహా డీఈఈ, ఏఈఈ, మహేశ్వరం తహసీల్దార్ సైదులు సూరం చెరువును పరిశీలించారు. త్వరలో సర్వే చేయించి నివేదిక రూపొందిస్తామని ఇంజినీర్లు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఎగువన ఉన్న కొత్తకుంటను మాత్రం నీటిపారుదలశాఖ ఇంజినీర్లు విస్మరించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. పత్రికలో వచ్చినందుకు మాత్రమే సూరం చెరువును పరిశీలించారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ బాధ్యతగా కబ్జాకు గురైన నీటి వనరులను పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందిపోయి కంటి తుడుపు చర్యగా సూరం చెరువును పరిశీలించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.