హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం 2018ని సవరించాలని క్యాబినెట్లో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ప్రతిపాదనను గవర్నర్‌కు పంపింది. శుక్రవారం రాజ్‌భవన్ అధికారులతో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రభుత్వ ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. చివరికి రిజర్వేషన్ల అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాదు స్థానిక సంస్థల్లో ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న రిజర్వేషన్ల ప్రక్రియను, అందుకు సంబంధించిన ప్రభుత్వ జీవోలు, ఆధార పత్రాలను కూడా తెప్పించి అధ్యయనం చేయాలని రాజ్‌భవన్ అధికారులకు గవర్నర్ సూచించినట్టు తెలుస్తున్నది.