మాదాపూర్, అక్టోబర్ 13: ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్న యశోద గ్రూపు దవాఖానలు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సల్లో మరో మైలురాయిని అధిగమించాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ల ద్వారా ఇప్పటివరకు 300 మందికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించాయి.
ఈ సందర్భంగా సోమవారం హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ‘యశోద’ గ్రూపు హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, వైద్యులను, కిడ్నీ దాతలను అభినందించారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి 10 మంది వయోజనుల్లో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఏటా కొత్తగా దాదాపు 6 లక్షల మంది కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారని ‘యశోద’ గ్రూప్ హస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు వివరించారు.