ములుగు, జూలై 7 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదముద్ర వేశారు. దీంతో ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2019 ఫిబ్రవరి 17న జిల్లా ఏర్పడిన నాటి నుంచి ములుగు పట్టణం పంచాయతీగానే కొనసాగింది. గత ప్రభు త్వం 2022 సెప్టెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా తెలంగాణ పురపాలక చట్టం-2019ను సవరించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ప్రస్తుత ప్రభుత్వం సూచనలతో ములుగును మున్సిపాలిటీగా చేసేందుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో మూడు గ్రామపంచాయతీలను కలుపుకొని 2011 జనా భా లెక్కల ప్రకారం మొత్తం 16,533 జనాభాతో 12,486 మంది ఓటర్లతో మున్సిపాలిటీగా ఏర్పాటు కానున్నది.
ఐదు రోజులు వర్షాలు
నేడు, రేపు పలు జిల్లాల్లో భారీగా కురిసే అవకాశం
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసిం ది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నా రాయణపేట, జోగులాంబగద్వాల, సంగారెడ్డి, యాదాద్రిభువనగిరి జిల్లా ల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జి ల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అత్యధికంగా 6.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.