హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘అపాయింటెడ్ డే’ పై వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతల వినతులను పెడచెవిన పెట్టి ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎన్నికల నిర్వహణకు అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ నేపథ్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ బూత్‌ల వివరాలు, బూత్ ఇన్చార్జుల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి (జాయింట్ లేబర్ కమిషనర్‌కు) అందజేసింది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మరో రెండు, మూడు రోజుల్లో ఫస్ట్ నోటీస్ ఇచ్చేందుకు ఎన్నికల నిర్వహణ అధికారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా, పారదర్శకంగా ముగిసేలా ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల అధికారితో చర్చిస్తూ సమన్వయం చేసుకుంటున్నది.