యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 23: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పల్లెనిద్ర పేరుతో చేసిన హంగామా అంతా కేవలం ఫొటోలకు పోజులిచ్చేందుకు, ప్రచారం కోసం మాత్రమేనని స్పష్టమైంది. ఆయన నిద్రిస్తున్న సమయంలో ఓసారి మంచంపై, మరోసారి పార్టీ నాయకులతో చాపకింద పడుకొని ఫొటోలకు పోజులిస్తున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆయన వర్టూర్లో నిద్ర చేసి, గ్రామానికి నిధులు మంజూరు చేశారా? లేక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పారా? అంటే అదీ లేదు. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఆ గ్రామానికి వచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ సాగుతున్నది. ఈ నెల 9న మోటకొండూరు మండలంలోని వర్టూర్లో పల్లెనిద్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శ్రీకారం చుట్టారు. ఆ రాత్రి వర్టూర్ గ్రామానికి వస్తే గ్రామ అభివృద్ధికి భారీగానే నిధులు మంజూరు చేస్తుండొచ్చని గ్రామస్తులు మురిసిపోయి మంగళహారతులిచ్చి, డప్పు, డోలు వాయిద్యాలు, కోలాటాల మధ్య ఘన స్వాగతం పలికారు.
రాత్రి దళితవా డలో పల్లె నిద్ర చేస్తున్నట్లు ఓ ధపా మంచం మీద, మరో దఫా కింద ఉన్న చాపపై నిద్రిస్తున్నట్లు ఎమ్మెల్యే ఫొటోకు పోజులిచ్చారు. ఆ మరుసటి రోజే లేచి గ్రామాన్ని కలియతిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతే ఈ గ్రామా న్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతూ ఎప్పటిమాదిరిగా తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర తొలిసీఎం కేసీఆర్పై నోరుపారేసుకున్నారు. ఎలాగో వచ్చాం కదా అని గతంలోనే దళితులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి వెళ్లిపోయారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రా మాల్లో ప్రజాప్రతినిధులు నిద్ర చేసి ఆ గ్రామానికి కావాల్సిన వసతులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి తక్షణ ఆర్థిక సాయం కింద ఎంతో కొంత నిధులు మంజూ రు చేయడం, అవసరమైతే ఆ గ్రామా న్ని దత్తత తీసుకోవడం పరిపాటి. కానీ ఎమ్మెల్యే అయిలయ్య మాత్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోగా కనీసం నమ్మదగిన హామీ కూడా ఇవ్వలేదని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు.
అమలు కానీ 6 గ్యారెంటీలు..
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు సైతం వర్టూర్లో అమలు కావడం లేదు. ఇప్పటి వరకు రైతు భరోసా, మహిళలకు రూ.2500 భృతి, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, వృద్ధులకు ఆసరా పెన్షన్ రూ. 4 వేలకు పెంపు వంటి హామీలు ఇప్పటి వరకు ఆ గ్రామంలో అమలుకు నోచుకోలేదు. కనీసం రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే కనీసం హామీ కూడా ఇవ్వలేదనే చర్చ సాగుతున్నది. గ్రామంలో ఇండ్లులేని 341 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 54 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో కూడా 37 మంది ఎస్సీలకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా 17 మందికి ఇండ్లు ఇవ్వకపోగా అర్హులైన ఎంతో మంది అనర్హులుగా గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదు.