హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో వృత్తి నైపుణ్య ఉద్యోగాల కోసం వెళ్లేవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. కన్సల్టెన్సీల(మధ్యవర్తులు) మోసాలను అరికట్టేందుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. ప్రైవేటు ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని వారికి వృత్తిపరమైన శిక్షణతోపాటు విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన మార్గనిర్దేశనం చేస్తున్నది. ప్రధానంగా నర్సింగ్, డ్రైవర్లు, ప్లంబర్లు, అధ్యాపక వృత్తికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. మనదేశం నుంచి ఈ పనుల కోసం చాలామంది వెళ్తుంటారు. వివిధ వృత్తుల వారు విదేశాల్లో ఉద్యోగం చేసుకొనేందుకు ప్రభుత్వం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఓఎంసీ)ని ఏర్పాటు చేసి, దీనిద్వారా ఆయా దేశాలకు వెళ్లేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నది. స్థానిక యువతకు ఆయా దేశాల్లోని ఆచార వ్యవహారాలు, భాష, పని విధానం, అర్హతలు, నియామక ప్రక్రియ తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నది.
పేర్ల నమోదు నుంచి..
టామ్‌కామ్ ద్వారా ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ కోర్సుల నిర్వహణతోపాటు విదేశాల్లో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల పేర్ల నమోదు, మొబిలైజేషన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లతో భాగస్వామ్యం, విదేశీ ఉద్యోగాల ప్రమాణాల మేరకు వారికి నైపుణ్యాభివృద్ధి నిర్వహణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు సంబంధించి నైపుణ్యం గల కార్మికుల డేటాబేస్, గల్ఫ్ కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్, వారి వినతుల పరిష్కారం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శిక్షణ, వర్క్‌షాప్‌ల నిర్వహణతోపాటు రిక్రూటింగ్ ఏజెంట్లతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
నర్సింగ్ ఉద్యోగాలపై వెయ్యిమందికి..
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగావకాశాలపై తగిన సమాచారం అందించేందుకు ఇటీవల నగరంలో ఓ వర్క్‌షాప్ నిర్వహించగా, దీనికి సుమారు వెయ్యిమంది అభ్యర్థులు హాజరయ్యారు. 12 దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలపై స్టాళ్లను ఏర్పాటు చేసి ఆయా దేశాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాల కోసం 25 మందికి శిక్షణ తరగతులు ప్రారంభించారు.
ఇప్పటికే 2,800 మందికి విదేశాల్లో ఉద్యోగాలు
విదేశాల్లో నిర్మాణ రంగం, హాస్పిటాలిటీ, ఐటీ, రవాణా, ఆటోమొబైల్ తదితర రంగాలకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికుల డిమాండ్ తీర్చడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఏసీ, ఎన్ఐటీహెచ్ఐఎం తదితర సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, మలేసియా, కువైట్, ఒమాన్ తదితర దేశాలకు నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, డొమెస్టిక్ కేర్, ఆటోమొబైల్, విద్య, ప్లాంటేషన్ తదితర రంగాల్లో పనుల కోసం దాదాపు 2,800 మందిని పంపారు. భవిష్యత్తులో టామ్‌కామ్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకొనే వారికి టామ్‌కామ్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ పేరు నమోదు చేసుకోవచ్చు. తగిన వివరాల కోసం www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.