Bribe : ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పాండు రంగారావు.. ఫిర్యాదుదారు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు.
స్థానికంగా నిర్మించిన మైనారిటీ కమ్యూనిటీ హాల్ పనులకు సంబంధించిన వివరాలను మెజర్మెంట్ బుక్‌లో నమోదు చేసి, బిల్లును పై అధికారులకు పంపడం కోసం పాండురంగారావు రూ.50 వేలు డిమాండ్ చేశారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు.. అవినీతి నిరోధక శాఖకు చెందిన మహబూబ్‌నగర్ విభాగం అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లిలోని మొదటి అడిషనల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు పాండురంగారావును రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.