హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపకరణాల దరఖాస్తు గడువు తరుముకొస్తుండటంతో దివ్యాంగులు పరేషాన్ అవుతున్నారు. దరఖాస్తుకు కేవలం పదకొండు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ సమయం ఇవ్వడంతో అవకాశం కోల్పోవాల్సి వస్తుందేమోనని లక్షలాదిమంది దివ్యాంగులు ఆందోళనకు గురవుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ సర్కారు ఈ నెల 3న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి పచ్చజెండా ఊపింది. రూ. 35 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల తర్వాత అంటే ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 7 నుంచి 18 వరకు గడువు విధించింది. అప్లికేషన్‌కు కేవలం 11 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఆధార్‌కార్డుతోపాటు కుల, ఆదాయ, సదరం ధ్రువీకరణపత్రాలను జత చేయాలని నోటిఫికేషన్లో నిర్దేశించింది. సర్టిఫికెట్ల కోసం 12 లక్షల మంది దివ్యాంగులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేశారు. అటు విద్యార్థులు, ఇటు దివ్యాంగులు ఒకేసారి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయడంతో జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మరోవైపు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు భూభారతి స్లాట్ బుకింగ్స్‌లో బిజీగా ఉండటంతో మరింత ఆలస్యమవుతున్నది. ఈ నెల 30 వరకు గడువు పొడిగించాలని మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషర్‌కు వినతిపత్రం సమర్పించామని, వారు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని ఎన్పీఆర్టీ (వికలాంగుల జాతీయ హక్కుల వేదిక) నాయకులు వాపోతున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో గ్రామీణ ప్రాంతాల దివ్యాంగులు అవకాశం కోల్పోయే పరిస్థితి ఉన్నదని, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు.