హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని మోసాలకు తెగబడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను తుంగలో తొక్కి డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కొరడా ఝళిపిస్తున్నది. తమ ప్రాజెక్టులను రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)లో రిజిస్టర్ చేయకుండానే ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్న రియల్టర్లకు నోటీసులు జారీచేస్తున్నది. ప్రీలాంచ్ సమయంలో బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ప్లాటు, ఫ్లాటు లభిస్తాయని పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రెరాలో రిజిస్టర్ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇండ్లు, ఇంటి స్థలాల కొనుగోలులో ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. స్థిరాస్తుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ చట్టం అధికారాన్ని కల్పిస్తున్నది.
2017 జనవరి 1 నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నింటినీ రెరాలో రిజిస్ట్రర్ చేయాల్సిందే. అలా చేయకుండా ఆయా ప్రాజెక్టుల్లోని ప్లాట్లు, ఫ్లాట్లకు బుకింగ్స్ చేపట్టడం, అమ్మడానికి ప్రయత్నించడం నేరం. రెరాలో రిజిస్ట్రర్ చేసుకున్నాకే వాటిని విక్రయించాల్సి ఉంటుంది. కానీ పలువురు రియల్టర్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో వారిపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఈ జాబితాలో ఆర్జే గ్రూపు, జైవాసవి లాంటి సంస్థలున్నాయి. రెరా చట్టం ప్రకారం వీటికి భారీగా జరిమానా విధించే అవకాశం ఉన్నది. మున్ముందు కూడా ఇలాంటి అక్రమాలు పునరావృతమైతే మరింత కఠిన చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.